పెళ్లైన వాళ్లందరికీ కనెక్ట్ అవుతుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’ పై కిరణ్ అబ్బవరం కాన్ఫిడెన్స్!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ విడుదలకు ముందే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేశ్ నిర్మించారు. జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో, హీరోయిన్ తమ పాత్రలు, సినిమా విశేషాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఈ కథ విన్న క్షణం నుంచే ఇది చేయాలని ఫిక్స్ అయ్యాను. మధ్యలో ఇతర సినిమాలు చేస్తున్నా, నా తొలి ప్రాధాన్యం మాత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’కే ఇచ్చాను అని చెప్పారు.. ఈ సినిమాలో హీరో ప్రేమించిన అమ్మాయిని ఎప్పుడూ ‘మీరు.. అండీ’ అని గౌరవంగా పిలుస్తాడు. ప్రేమలోనూ మర్యాద ఎంత అందంగా ఉంటుందో ఈ కథ చూపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు పెళ్లైన ప్రతి ఒక్కరినీ కచ్చితంగా టచ్ చేస్తాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కనీసం ఐదు సీన్లు మళ్లీ మళ్లీ గుర్తుకొస్తాయి. పదేళ్ల తర్వాత కూడా నా కెరీర్‌లో బెస్ట్ సినిమాల్లో ఇది టాప్‌లో ఉంటుంది అని కిరణ్ ధీమా వ్యక్తం చేశారు.
అలాగే విడుదల తేదీపై స్పందిస్తూ.. మా సినిమా కంటే ఒక రోజు ముందే విజయ్ ‘జన నాయకన్’ ( జూలై 23, 2026 ) విడుదలవుతోంది. అది ఆయన చివరి సినిమా కావడంతో ప్రేక్షకుల దృష్టి అటే ఉంటుంది. సీఎం విజయ్‌కి ఆల్ ది బెస్ట్. మా రిలీజ్ మరో తేదీ అయితే బాగుండేది. అయినా మంచి కథను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.
►ALSO READ | బాబోయ్ ఒక్కొ టికెట్ ధర 3 వేలకు పైగానే.. నొలాన్ ‘ది ఒడిస్సీ’ రేట్లు చూసి జనాలు షాక్!
హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ మాట్లాడుతూ.. ఇది కేవలం ప్రేమకథ కాదు.. ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే సినిమా. హీరో, హీరోయిన్ ఇద్దరి పాత్రలకూ సమాన ప్రాధాన్యం ఉంటుంది. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. స్వచ్ఛమైన ప్రేమ విలువను ఈ తరం మళ్లీ గుర్తు చేసుకునేలా ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు. అందమైన ప్రేమ, హృదయాన్ని తాకే భావోద్వేగాలు, సహజమైన సంభాషణలతో ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రేక్షకులను ఎంతగా మెప్పిస్తుందో చూడాలి మరి.