ఏనుగులు పగబడతాయా..? గ్రామం మారినా వెంటాడింది.. 14 ఏళ్లలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని చంపిన ఏనుగు!

నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని, దాదాపు 14 సంవత్సరాల వ్యవధిలో ఒకే ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ధుర్బే అనే అడవి ఏనుగు 2012 నుంచి అదే కుటుంబాన్ని వరుసగా లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
2012 డిసెంబర్‌లో మాడి పట్టణానికి చెందిన శనిచార్ బోటే తల్లిదండ్రులను ధుర్బే అనే ఏనుగు తొక్కి చంపింది. ఆ ఘటన తర్వాత భయాందోళనలకు గురైన బోటే కుటుంబం మాడి ప్రాంతాన్ని విడిచి, రాప్తి నదిని దాటి దాదాపు తొమ్మిది మైళ్ల దూరంలో ఉన్న జగత్‌పూర్‌కు వెళ్లి కొత్త జీవితం ప్రారంభించింది. ప్రధాన నదిని దాటితే ఏనుగు అక్కడికి రాదని వారు భావించారు.
అయితే, ఈ ఏడాది జూలై నెల ప్రారంభంలో విషాదం మరోసారి పునరావృతమైంది. ధుర్బే జగత్‌పూర్‌లోని బోటే ఇంట్లోకి చొరబడి, ఆయన కోడలు 25 ఏళ్ల అషికా బోటే, నాలుగేళ్ల మనవడు భరత్ బోటేను చంపేసింది. దీంతో ఒకే ఏనుగు దాడిలో ఆ కుటుంబానికి చెందిన మొత్తం నలుగురు సభ్యులు ప్రాణాలు కోల్పోయినట్లు నమోదైంది. “మేము సురక్షితంగా ఉంటామని భావించి గ్రామం మార్చుకున్నాం. కానీ అదే ఏనుగు మళ్లీ మమ్మల్ని వెతికి వచ్చింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియడం లేదు” అని శనిచార్ బోటే ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్వాన్ నేషనల్ పార్క్ అధికారుల సమాచారం ప్రకారం, ధుర్బే అనే ఏనుగు నేపాల్‌లో అత్యంత ప్రమాదకరమైన మృగ ఏనుగులలో ఒకటి. 2010 నుంచి ఇప్పటివరకు ఈ ఏనుగు దాడుల్లో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దాని కదలికలను పర్యవేక్షించేందుకు 2016లో మొదటిసారి ట్రాకింగ్ కాలర్ అమర్చగా, అది పనిచేయకపోవడంతో 2020, 2023 సంవత్సరాల్లో కొత్త కాలర్లను అమర్చారు. అయినప్పటికీ, మానవ-వన్యప్రాణుల ఘర్షణలను పూర్తిగా అరికట్టడం అధికారులకు సవాల్‌గా మారింది. ఈ తాజా ఘటనతో చిత్వాన్ ప్రాంతంలో ప్రజల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..