Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?

Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు ఊహించని బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఒకే తెరపై నాగార్జునతో పాటు ఆయన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ కనిపించబోతున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూడు తరాల స్టార్ ఇమేజ్‌ను ఒకే కథలో చూపించే ప్రయత్నం కావడంతో అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ కల తాత్కాలికంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు నిలిచిపోయింది? కథలో వచ్చిన సమస్య ఏంటి? ఇక అక్కినేని హీరోలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అనే విషయాల్లోకి వెళ్తే…
ఈ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించాల్సి ఉంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యాయి కూడా. జూలైలో షూటింగ్ ప్రారంభించి, 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే కథ తుది రూపం దాల్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అందుతున్న సమాచారం ప్రకారం, దర్శకుడు సిద్ధం చేసిన ఫైనల్ స్క్రిప్ట్‌తో నాగ చైతన్య, అఖిల్ పూర్తిగా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. కథలో ఇద్దరికీ కొన్ని సందేహాలు ఉండటంతో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడం సరైన నిర్ణయం కాదని భావించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇద్దరు హీరోలకు భిన్నమైన ప్రాజెక్ట్స్ ఉండటంతో, నాగార్జున కూడా ఈ దశలో సినిమాను ప్రారంభించకుండా వేచి చూడాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడకపోవడంతో, ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే దానిపై ప్రకటన వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
మరోవైపు నాగ చైతన్య ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం ‘దూత 2’తో పాటు దర్శకుడు క్లాక్స్‌తో ఒక కొత్త సినిమా, మరో హారర్ జానర్ ప్రాజెక్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్న చైతన్య, ఈ చిత్రాలపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారని సమాచారం. అఖిల్ కూడా కొత్త ప్రాజెక్ట్ లతో వేగం పెంచారు. ప్రస్తుతం రెండు కొత్త కథలను పరిశీలిస్తున్న ఆయన, వాటిలో ఒక సినిమాను ఈ నెలలోనే ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘లెనిన్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అఖిల్ ఈసారి మరింత బలమైన స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల టాక్.
ఇక నాగార్జున విషయానికి వస్తే, తన కుమారులు తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీ అయిన తర్వాత ఆయన తన ప్రతిష్టాత్మక ‘కింగ్ 100’ ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అలాగే దసరా తర్వాత మరో కొత్త సినిమాకు కూడా ఆయన సంతకం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అక్కినేని త్రయం కలిసి నటించే సినిమా ఇప్పట్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు తగ్గినా, భవిష్యత్తులో మరింత బలమైన కథతో ఈ కల నిజమయ్యే అవకాశం మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేం. అభిమానులు కూడా ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.