గాంధీ దవాఖానలో రిమాండ్ ఖైదీ మృతి..బెయిల్ వచ్చిన రోజే ఘటన

పద్మారావు నగర్, వెలుగు: చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ యువకుడు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో కర్నాటకకు చెందిన రోహిత్ అనే యువకుడు 2 నెలల క్రితం చర్లపల్లి జైలుకు రిమాండ్ ఖైదీగా వెళ్లాడు. అయితే, మనస్తాపానికి గురైన అతను ఈ నెల 12న జైల్లోనే ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సిబ్బంది సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతిచెందాడు. కాగా, రోహిత్‌కు కోర్టు నుంచి అదే రోజు బెయిల్ మంజూరైంది. గురువారం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం అధికారులు రోహిత్ భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.