July 17, 2026

ఫిఫా వరల్డ్ కప్ క్లోజింగ్ సెర్మనీకి టాప్ సెలబ్రిటీలు.. టామ్ క్రూజ్, జస్టిన్ బీబర్, బీటీఎస్ రెడీ!

ఫిఫా వరల్డ్ కప్ క్లోజింగ్ సెర్మనీకి టాప్ సెలబ్రిటీలు.. టామ్ క్రూజ్, జస్టిన్ బీబర్, బీటీఎస్ రెడీ!
Reading Time: 2 minutes

ఫిఫా వరల్డ్ కప్ క్లోజింగ్ సెర్మనీకి టాప్ సెలబ్రిటీలు.. టామ్ క్రూజ్, జస్టిన్ బీబర్, బీటీఎస్ రెడీ!

Caption of Image.

FIFA World Cup Closing Ceremony: ఫుట్‌బాల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ ఏకంగా 48 జట్లతో జరిగిన ఫిఫా ప్రపంచకప్ మహా సంగ్రామం ముగింపు దశకు చేరుకుంది. జులై19 (ఆదివారం) న్యూయార్క్‌లో అర్జెంటీనా vs స్పెయిన్ మధ్య జరగబోయే టైటిల్ ఫైట్ కోసం క్రీడా ప్రపంచం ఎంతగానో ఎదురు చూస్తోంది. అయితే మ్యాచ్ కిక్‌ఆఫ్‌ కంటే ముందే ప్రేక్షకులను ఊగించేందుకు ఫిఫా (FIFA) ఒక కళ్ళు చెదిరే ముగింపు వేడుకలకు (Closing Ceremony) ప్లాన్ చేసింది. ప్రపంచ స్థాయి వినోదం, సంస్కృతి, ఫుట్‌బాల్ కలయికతో సాగబోయే ఈ వేడుకల్లో గ్లోబల్ సూపర్ స్టార్స్ తమ పర్ఫార్మెన్స్‌లతో స్టేజ్ షేక్ చేయనున్నారు.

క్లోజింగ్ సెర్మనీలో హాలీవుడ్ స్టార్ట్స్ హంగామా:  
మ్యాచ్ ప్రారంభానికి ముందే జరిగే ప్రీ-మ్యాచ్ షోలో అంతర్జాతీయ సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టించిన లారా పౌసిని, నికోల్ షెర్జింగర్, రాబీ విలియమ్స్, ప్రముఖ యూట్యూబ్ స్ట్రీమర్ ఐషోస్పీడ్ (IShowSpeed)లు పర్ఫార్మ్ చేయనున్నారు. వీరితో పాటు హాలీవుడ్ యాక్షన్ స్టార్ టామ్ క్రూజ్ (Tom Cruise) ఒక ప్రత్యేకమైన అప్పియరెన్స్ ఇవ్వనుండటంతో ఈ వేడుకల స్థాయి నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈజీఓటీ (EGOT) అవార్డు విజేత జెన్నిఫర్ హడ్సన్ అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించి ఫైనల్ పోరుకు అధికారికంగా తెర లేపనున్నారు.

చరిత్రలో తొలిసారి.. 25 నిమిషాల మెగా షో: 
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే ముందెన్నడూ లేని విధంగా ఈసారి ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యేకంగా ఒక హాఫ్-టైమ్ షో (Half-Time Show)ను నిర్వహించబోతున్నారు. సాధారణ బ్రేక్ సమయం కంటే ఎక్కువగా, దాదాపు 25 నిమిషాల పాటు సాగే ఈ మెగా మ్యూజికల్ ఈవెంట్ ఫిఫా గ్లోబల్ సిటిజన్ ఎడ్యుకేషన్ ఫండ్ మద్దతుగా కొనసాగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారులకు నాణ్యమైన విద్య, అలాగే ఫుట్‌బాల్ ఆడేందుకు సమాన అవకాశాలు కల్పించడం కోసం ఏకంగా 100 మిలియన్ డాలర్ల (USD 100 Million) నిధులను సేకరించడమే ఈ షో యొక్క ప్రధాన ఉద్దేశం.

మడోన్నా, షకీరా, జస్టిన్ బీబర్, బీటీఎస్: 
ప్రముఖ అంతర్జాతీయ బ్యాండ్ కోల్డ్‌ప్లే (Coldplay) లీడర్ క్రిస్ మార్టిన్ క్యూరేట్ చేయబోతున్న ఈ హాఫ్-టైమ్ షోలో పాప్ క్వీన్స్ మడోన్నా, షకీరా లతో పాటు గ్లోబల్ పాప్ ఐకాన్ జస్టిన్ బీబర్, కొరియన్ పాప్ సంచలనం బీటీఎస్ (BTS) లు కలిసి ఒకే వేదికపై దుమ్మురేపనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫ్యాన్స్ ఈ అద్భుతమైన లైవ్ పర్ఫార్మెన్స్‌ను టీవీలు, డిజిటల్ స్క్రీన్‌లపై వీక్షించే అవకాశాన్ని ఫిఫా కల్పించింది. 

ALSO READ : వరల్డ్ కప్ ట్రోఫీకి లగ్జరీ టచ్.. 

ముగింపు వేడుకల టైమింగ్స్: 
న్యూయార్క్ లోని న్యూజెర్సీ స్టేడియంలో జరగబోయే ఈ క్లోజింగ్ సెర్మనీ భారత కాలమానం (IST) ప్రకారం జులై 19 ఆదివారం రాత్రి 11:00 గంటలకు (23:00 IST) ప్రారంభం కానుంది. సరిగ్గా 90 నిమిషాల పాటు సాగే ఈ కళాసాంస్కృతిక వేడుకల అనంతరం, సోమవారం తెల్లవారుజామున 12:30 గంటలకు (00:30 IST) అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ ప్రియులకు, ఫుట్‌బాల్ అభిమానులకు ఈ ఆదివారం నైట్ ఒక అల్టిమేట్ విజువల్ ఫీస్ట్ కాబోతోంది. 

©️ VIL Media Pvt Ltd.