బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్.. బ్యాటింగ్‌లో తడబడిన ఇంగ్లాండ్.. టార్గెట్ ఎంతంటే..?

IND vs ENG: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో బిగ్ ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. ఒకానొక దశలో భారత బౌలర్ల ధాటికి కనీసం 150 పరుగులు కూడా దాటడం గగనమే అనుకున్న ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టును ఇద్దరు ప్లేయర్స్ ఊహించని రీతిలో ఆదుకున్నారు. మైదానంలో టీమిండియా బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్న తరుణంలో.. ఆ ఇద్దరూ అడ్డుగోడలా నిలిచి జట్టును పతనం నుంచి రక్షించారు. 47.5 ఓవర్లలో ఇంగ్లాండ్ 258 పరుగులకు ఆలౌట్ అయింది.
కుప్పకూలిన ఇంగ్లీష్ జట్టు:
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా 61 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు. అయితే ఆ తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అయింది. భారత బౌలర్లు ఒక్కసారిగా విజృంభించడంతో కేవలం 46 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లాండ్ ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. 61/0 నుంచి 107/6 పరుగులకు పడిపోయి తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది.
రూట్, డాసన్ 121 రన్స్ పార్ట్‌నర్‌షిప్:
క్రీజులో నిలదొక్కుకోవడమే కష్టంగా మారిన ఆ సమయంలో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్, అతనికి తోడైన లియామ్ డాసన్ పట్టుదలగా ఆడారు. ఈ ఇద్దరూ కలిసి ఏడో వికెట్‌కు అత్యంత విలువైన 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకి గౌరవప్రదమైన స్కోర్ అందించేలా చేశారు. ఈ క్రమంలో లియామ్ డాసన్ 68 పరుగులు చేసి అవుట్ కాగా, వన్-మ్యాన్ షో చేసిన జో రూట్ 76 పరుగులతో చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు.
4 వికెట్లతో చెలరేగిన అక్షర్ పటేల్:
భారత బౌలర్లలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ మరోసారి తన సత్తా చాటాడు. పిచ్ అనుకూలతను వాడుకుంటూ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ మిడిలార్డర్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 10 ఓవర్లలో 62 రన్స్ ఇచ్చి కీలకమైన 4 వికెట్లు పడగొట్టి భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు.
భారత బౌలింగ్ ఆదుర్స్:
ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టుకు వణుకుపుట్టించింది మాత్రం జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణలే.. ఎందుకంటే, ఈ ఇద్దరి బౌలింగ్ ని ఎదుర్కొనేందుకు ఇంగ్లీష్ ఓపెనర్లు తెగ కష్టపడ్డారు. వీరి బౌలింగ్ లో పరుగులు చేసేందుకు నానా అవస్థలు పడ్డారు. బుమ్రా– ప్రసిద్ జోడి బౌలింగ్ చేసిన 8 ఓవర్లలో రన్స్ ఇవ్వకుండా కట్టడి చేశారు. బుమ్రా 9 ఓవర్లు వేసి 31 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకోగా, ప్రసిద్ 10 ఓవర్లు వేసి 50 పరుగులు సమర్పించుకుని 2 వికెట్లు దక్కించుకున్నాడు.