July 14, 2026

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్‌.. అర్ధరాత్రి నుంచి అమలు..

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్‌.. అర్ధరాత్రి నుంచి అమలు..
Reading Time: 2 minutes
Ttd Introduces New Donor Policy Revises Privileges Tirumala Board Approves Key Development Projects

TTD: తిరుమలలో సామాన్య భక్తుల దర్శనాలకు మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దాతలకు కల్పించే సౌకర్యాలను హేతుబద్ధీకరిస్తూ (Rationalization) కొత్త డోనర్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర వెల్లడించారు. ఈ కొత్త విధానం ఈరోజు అర్థరాత్రి నుంచే అమల్లోకి రానుంది. అయితే ఇప్పటికే విరాళాలు చెల్లించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న సౌకర్యాల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు.

కొత్త పాలసీతో వచ్చే మార్పులు ఏంటి..?

కొత్త పాలసీ ప్రకారం రూ.10 లక్షలు విరాళంగా అందించిన భక్తులకు గతంలో సంవత్సరానికి మూడు సార్లు లభించే బ్రేక్ దర్శనాన్ని ఇకపై సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కల్పించనున్నారు. అదనంగా మరోసారి సుపథం ద్వారా దర్శనం కల్పిస్తారు. అలాగే వ్యక్తిగతంగా విరాళాలు అందించిన దాతలకు ఇప్పటివరకు ఉన్న జీవితకాల ప్రివిలేజెస్‌ను ఇకపై 20 సంవత్సరాలకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు.

పాలకమండలి కీలక నిర్ణయాలు..

టీటీడీ పాలకమండలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రూ.6.31 కోట్ల వ్యయంతో తిరుమలలో ఎస్‌ఎస్‌డీ టోకెన్లు పొందిన భక్తులు వేచి ఉండేందుకు ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుమారధార, పసుపుధార డ్యామ్‌ల భద్రతను మరింత పెంచేందుకు రూ.2.77 కోట్లతో డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. తిరుమలలో గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహంలో భాగంగా జీఎన్‌సీ సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్‌ను విరాళంగా ఏర్పాటు చేసి, 25 సంవత్సరాల పాటు టీటీడీకి ఉచిత విద్యుత్ అందించే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.

కాకులమానుతిప్ప ప్రాంతంలోని 25 ఏళ్లకు పైబడిన ఘన వ్యర్థాలను బయో-రిమీడియేషన్, బయో-మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి రూ.5 కోట్లు కేటాయించారు. తిరుమల, తిరుపతిలోని టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థల నిర్వహణ కోసం రూ.2.35 కోట్లతో పనులు కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే ఆక్టోపస్ బేస్ క్యాంప్‌లో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2.26 కోట్లు, మూడు సంవత్సరాల ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సేవలకు రూ.65 లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.

అదేవిధంగా ఒంటిమిట్ట శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారి మూలవిరాట్టులకు బంగారు కవచాల తయారీ కోసం టీటీడీ ట్రెజరీలోని బంగారాన్ని వినియోగించేందుకు అనుమతి ఇచ్చారు. ఒంటిమిట్ట ఆలయం వద్ద రూ.17.84 కోట్లతో 100 గదుల విశ్రాంతి గృహ నిర్మాణానికి టెండర్లను ఆమోదించారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ముఖ మండపంపై “సలహారం” నిర్మాణం, ప్రాకార గోడ నిర్మాణం కోసం ఇప్పటికే మంజూరైన రూ.50 లక్షలకు అదనంగా రూ.15.30 లక్షలు కేటాయించారు.

కొత్త పోస్టులు..

టీటీడీ విజిలెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు డిప్యుటేషన్ ప్రాతిపదికన 120 పోస్టుల సృష్టికి ప్రభుత్వ అనుమతి కోరాలని నిర్ణయించారు. అలాగే సెక్యూరిటీ, విజిలెన్స్ గార్డుల నియామక విధానంలో ప్రస్తుతం అమలులో ఉన్న మాజీ సైనికులు–పౌరుల నిష్పత్తిని రద్దు చేసి, ఇకపై పౌరుల నుంచే ప్రత్యక్ష నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోరాలని బోర్డు నిర్ణయించింది. సత్యసాయి జిల్లా లేపాక్షిలో రూ.6.40 కోట్లతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలన్నీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు తిరుమలలో మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడనున్నాయి.