వందశాతం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు

- ముసాయిదాను విడుదల చేసిన ఎన్ఎంసీ
హైదరాబాద్, వెలుగు: మెడికల్ కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే సమయానికే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంద శాతం పూర్తి కావాలని, పనులు జరుగుతున్నాయని చెబితే ఆ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోమని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. కాలేజీ బిల్డింగ్స్, హాస్పిటల్స్ విషయంలో తాత్కాలిక ఏర్పాట్లకు అనుమతి ఉండదని, కొత్త కాలేజీలతోపాటు ప్రస్తుతం నడుస్తున్న కాలేజీలు కూడా కచ్చితంగా నిర్ణీత కార్పస్ ఫండ్ నిర్వహించాలని పేర్కొంది.
ఈ మేరకు మెడికల్ కాలేజీల ఏర్పాటు, కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు నిబంధనలను సవరిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ‘ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్ (సవరణ) నిబంధనలు-2026’ ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. దరఖాస్తుతోపాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్ లెటర్, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్ ధృవీకరించిన సాల్వెన్సీ సర్టిఫికెట్ సమర్పించడం తప్పనిసరి అని వెల్లడించింది. కంపెనీలు, ట్రస్టులు కాలేజీల ఏర్పాటుకు అర్హులని తెలిపింది. దరఖాస్తుల ప్రక్రియలో ఎన్ఎంసీ లేదా మార్బ్ (ఎంఏఆర్బీ)పై వ్యక్తులు, ఏజెన్సీల ద్వారా ఒత్తిడి తెస్తే అప్లికేషన్లను వెంటనే రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ ముసాయిదాపై ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా emiarr2026amendment@nmc.org.in ఈ–మెయిల్ ఐడీకి పంపాలని ఎన్ఎంసీ సూచించింది.