ఆధ్యాత్మికం : “చనిపోయాక నరకానికి పోవడం ఖాయం.. బతికుండగా ఈ 7 పనులు అస్సలు చేయకండి!”

హిందూ సాంప్రదాయంలో అత్యంత కీలకమైన గ్రంథాలలో ‘గరుడ పురాణం’ ఒకటి. మనిషి జీవితం, మరణం, మనం చేసే కర్మలు.. వాటి వల్ల వచ్చే ఫలితాల గురించి ఇందులో చాలా వివరంగా చెప్పారు. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి ఆత్మకు ప్రశాంతత చేకూరడానికి, జీవిత పరమార్థం అర్థం కావడానికి ఇంట్లో గరుడ పురాణాన్ని పఠిస్తారు.
గరుడ పురాణం ప్రకారం.. మనిషి బతికున్నప్పుడు చేసే కొన్ని తప్పులు లేదా పాపాల వల్ల మరణానంతరం మోక్షం లభించదు సరికదా, నేరుగా నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఆ ఏడు ఘోరమైన తప్పులు (పాపాలు) ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా….
నరకానికి దారితీసే 7 ఘోరమైన తప్పులు:
1. కన్న తల్లిదండ్రులను అవమానించడం
కన్నవారిని గౌరవించకపోవడం అన్నిటికంటే పెద్ద పాపమని గరుడ పురాణం చెబుతోంది. కారణం లేకుండా తల్లిదండ్రులను మానసికంగా, శారీరకంగా హింసించేవారికి, వారి కనీస అవసరాలను పట్టించుకోని వారికి ఎప్పటికీ మోక్షం లభించదు. అలాంటి వారు చనిపోయాక నరకంలో తీవ్రమైన శిక్షలు అనుభవిస్తారు.
2. అబద్ధాలు చెప్పి ఇతరులను ముంచడం
స్వార్థం కోసం అబద్ధాలు ఆడుతూ, ఇతరుల జీవితాలను నాశనం చేసేవారిని గరుడ పురాణం క్షమించదు. ఒకరిని మోసం చేసి ఆనందించే వారు చేసిన పుణ్యమంతా నశించిపోతుంది. మరణానంతరం వీరికి నరకమే ప్రాప్తిస్తుంది.
3. మద్యపానం & వ్యసనాలకు బానిస కావడం
మద్యాన్ని సేవించడం, వ్యసనాలకు లోనై ధర్మ మార్గాన్ని తప్పడాన్ని గరుడ పురాణం తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి అలవాట్లు ఉన్నవారి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. వారు బతికున్నప్పుడే కాదు, చనిపోయాక కూడా నరకయాతన అనుభవిస్తారు.
4. అన్నాన్ని కించపరచడం
కూడు పెట్టే అన్నాన్ని గౌరవించకపోవడం, ప్లేటులో సగం అన్నం వదిలేసి వృథా చేయడం అన్నపూర్ణాదేవిని అవమానించడంతో సమానం. ఇలా చేసేవారి దగ్గర సంపద ఎక్కువ కాలం నిలవదు. అన్నాన్ని గౌరవించని వారికి స్వర్గ ప్రాప్తి ఉండదు.
5. బలహీనులను వేధించడం
తమకంటే బలహీనులైన వారిని, పేదలను, నోరులేని జీవులను అణచివేసే వారికి ఎంత సంపాదించినా మనశ్శాంతి ఉండదు. గరుడ పురాణం ప్రకారం ఇదొక ఘోరమైన పాపం. ఈ తప్పు చేసేవారికి మోక్ష మార్గం మూసుకుపోతుంది.
6. ధర్మాన్ని, మతాలను కించపరచడం
ఏదైనా ఒక మతాన్ని లేదా ధర్మాన్ని దూషించడం, దేవుడిని, గురువులను హేళన చేయడం మహాపాపం. ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు జీవితంలో ఎంత ఎదిగినా చివరికి పతనం తప్పదు. చనిపోయాక వీరు నరకానికి వెళ్లాల్సిందే.
7. స్తోమత ఉండి కూడా దానధర్మాలు చేయకపోవడం
భగవంతుడు మనకు మంచి సంపాదన, సాయం చేసే శక్తిని ఇచ్చినప్పుడు తోటివారికి దానధర్మాలు చేయాలి. అలా కాకుండా పరమ లోభిగా మారి ఎవరికీ ఒక్క రూపాయి కూడా సాయం చేయని వారికి ఈ జన్మలో మోక్షం లభించదు. చనిపోయాక వీరు నరకంలో కఠినమైన శిక్షలను ఎదుర్కొంటారు.
మనం చేసే మంచి, చెడు పనులే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. బతికున్నప్పుడు ఈ ఏడు తప్పులకు దూరంగా ఉంటూ, మంచి మార్గంలో నడిస్తేనే జీవితంలో ప్రశాంతత, మరణానంతరం ఉత్తమ గతులు లభిస్తాయని గరుడ పురాణం మనకు బోధిస్తోంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.