July 17, 2026

కోహ్లీ, శ్రేయస్‌‌ మెరిసినా..రెండో వన్డేలో టీమిండియా ఓటమి

కోహ్లీ, శ్రేయస్‌‌ మెరిసినా..రెండో వన్డేలో టీమిండియా ఓటమి
Reading Time: 2 minutes

కోహ్లీ, శ్రేయస్‌‌ మెరిసినా..రెండో వన్డేలో టీమిండియా ఓటమి

Caption of Image.
  •  
  • రెండో వన్డేలో ఇంగ్లండ్‌‌  బౌలర్ల విజృంభణ
  • 15 రన్స్‌‌ వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా

కార్డిఫ్‌‌: తొలి వన్డే గెలిచి జోరుమీదున్న ఇండియా బ్యాటర్లకు రెండో మ్యాచ్‌‌లో ఇంగ్లండ్‌‌ బౌలర్లు చుక్కలు చూపెట్టారు. విరాట్‌‌ కోహ్లీ (66 బాల్స్‌‌లో 8 ఫోర్లతో 65), శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (71 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 66) మెరిసినా.. మిగతా లైనప్‌‌ను పేకమేడలా కూల్చారు. దాంతో గురువారం జరిగిన రెండో వన్డేలో.. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 44 ఓవర్లలో 233 రన్స్‌‌కే ఆలౌటైంది. జోఫ్రా ఆర్చర్‌‌ (3/47), గస్‌‌ అట్కిన్సన్‌‌ (3/50) చెరో మూడు వికెట్లతో ఇండియా బ్యాటింగ్‌‌ను శాసించారు. తర్వాత ఛేజింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌ కడపటి వార్తలందేసరికి 20 ఓవర్లలో 100/4 స్కోరు చేసింది. రూట్​ (31 బ్యాటింగ్​), బట్లర్​ (6 బ్యాటింగ్​)క్రీజులో ఉన్నారు. డకెట్​(0), బెథెల్​ (4), హ్యారీ బ్రూక్​ (16) నిరాశపర్చారు.

కోహ్లీ క్లాస్.. రోహిత్ తడబాటు

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా ఓపెనర్లలో శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (31) ఓ ఫోర్‌‌, సిక్స్‌‌తో ధాటిగా ఆడాడు. కానీ ఏడో ఓవర్‌‌లోనే అట్కిన్సన్‌‌ బౌలింగ్‌‌లో వెనుదిరిగాడు. 44/1 స్కోరు వద్ద వచ్చిన కోహ్లీ క్లాస్‌‌ ఇన్నింగ్స్‌‌తో ఆకట్టుకున్నాడు. తన పాత తరం షాట్లను చూపెడుతూ ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఆర్చర్‌‌ బౌలింగ్‌‌లో విరాట్‌‌ కొట్టిన స్ట్రయిట్‌‌ డ్రైవ్‌‌ మ్యాచ్‌‌కే హైలెట్‌‌గా నిలిచింది. రెండో ఎండ్‌‌లో హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ శర్మ (26) రన్స్‌‌ చేయడానికి తీవ్రంగా శ్రమించాడు.

లెఫ్టార్మ్‌‌ స్పిన్నర్లు రోహిత్‌‌ను చాలా ఇబ్బందిపెట్టారు. రెండో వికెట్‌‌కు 60 రన్స్‌‌ జత చేసి 18వ ఓవర్‌‌లో రోహిత్‌‌ ఔటయ్యాడు. ఈ దశలో వచ్చిన శ్రేయస్‌‌ సూపర్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడాడు. షార్ట్‌‌ పిచ్‌‌ బాల్స్‌‌ను సమర్థంగా ఎదుర్కొన్న కోహ్లీతో కలిసి నాలుగో వికెట్‌‌కు 67 రన్స్‌‌ జత చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ 50,  శ్రేయస్‌‌ 42 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీలు పూర్తి చేశారు. అయితే 32వ ఓవర్‌‌లో ఆర్చర్‌‌ బౌలింగ్‌‌ కీపర్‌‌ క్యాచ్‌‌ నుంచి బయటపడిన కోహ్లీ.. తర్వాతి బాల్‌‌కే రషీద్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో ఇండియా స్కోరు 178/4గా మారింది. మిడిలార్డర్‌‌లో ఇషాన్‌‌ కిషన్‌‌ (1), సుందర్‌‌ (2), అక్షర్‌‌ పటేల్‌‌ (1), శివమ్‌‌ దూబే (0) సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. కేవలం 26 బాల్స్‌‌ వ్యవధిలో 15 రన్స్‌‌ మాత్రమే చేసి ఈ నలుగురూ ఔట్‌‌ కావడంతో ఇండియా 194/7తో కష్టాల్లో పడింది. చివర్లో బుమ్రా (20 నాటౌట్‌‌) బ్యాట్‌‌ ఝుళిపించే ప్రయత్నం చేసినా.. గుర్నూర్‌‌ బ్రార్‌‌ (7), ప్రసిధ్‌‌ కృష్ణ (0) ఫెయిల్‌‌ కావడంతో ఇండియా పూర్తి ఓవర్లు ఆడలేకపోయింది.

©️ VIL Media Pvt Ltd.