ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలు విడుదల చేయాలి..ఇందిరా పార్క్ వద్ద ఎంపీ ఆర్.కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష

ముషీరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలనే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రూ.8 వేల కోట్ల బకాయిలు విడుదల చేసి, స్కీంను పాత పద్ధతిలోనే కొనసాగించాలన్నారు. మంగళవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఆయన సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీనికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి మద్దతు తెలిపారు.
దీక్షలో ఆర్.కృష్ణయ్య కండ్లు తిరిగి పడిపోవడంతో అంబులెన్స్ వైద్యులు పరీక్షించారు. షుగర్ లెవెల్స్ తగ్గి, హై బీపీ రావడంతో హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించినా ఆయన నిరాకరించి దీక్ష కొనసాగించారు. చివరకు మధుసూదనాచారి విరమింపజేశారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.