తిరుమలకు వెళ్తున్నారా..? భక్తులూ జర భద్రం.. టీటీడీ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..

తిరుమల శ్రీవారి దర్శనం, వసతితో పాటు సేవా టికెట్లు సైతం అందుబాటులో ఉన్నాయంటూ భక్తులను బురిడీ కొట్టించిన ఘరానా మోసగాడి బండారం బయట పడింది. తిరుమల వెంకన్న భక్తులను నమ్మించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన మోసగాడి బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్టు చేయడంతో.. తిరుపతికి చెందిన టీటీడీ మాజీ ఉద్యోగి టి. అరుణ్ కుమార్ (26) యవ్వారం వెలుగు చూసింది. అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన తిరుమల టూ టౌన్ పోలీసులు .. విచారణలో నిందితుడి గత చరిత్రను బయట పెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన అరుణ్ కుమార్ టీటీడీ ఉద్యోగి. 2023లో శ్రీవారి దర్శనం పేరుతో ఇదే తరహా మోసానికి పాల్పడ్డ కేసులో అరస్టయ్యాడు. దీంతో ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు. ఇటీవల బెంగళూరుకు చెందిన రెండు కుటుంబాల నుంచి రూ.3.20 లక్షలు వసూలు చేసిన అరుణ్ కుమార్ అడ్డంగా దొరికి పోయాడు. నిందితుడి బ్యాంకు ఖాతాల్లో గత ఏడాది కాలంలో సుమారు రూ.85 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు.. మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్, రూ.99,000 నగదు, మూడు బ్యాంక్ పాస్‌బుక్స్ స్వాధీనం చేసుకున్నారు.
భక్తులూ జర భద్రం..
శ్రీవారి దర్శనం, సేవలు, వసతి పేరుతో మధ్యవర్తులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని జిల్లా పోలీస్ యంత్రాంగం టిటిడి బిజినెస్ విభాగం హెచ్చరిస్తోంది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, అధికారిక కౌంటర్ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని సూచిస్తుంది. మోసగాళ్లు ఇతరుల బ్యాంకు ఖాతాలను మ్యూల్ అకౌంట్స్ గా వినియోగిస్తున్నారని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టిటిడి సివిఎస్ఓ మురళీకృష్ణ భక్తులను అప్రమత్తం చేస్తున్నారు. మీ ఖాతాలో డబ్బు జమ చేసి మరొకరికి పంపండనే అభ్యర్థనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దంటున్నారు. అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే డయల్-112 లేదంటే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..