July 14, 2026

Balayya: బాలయ్య విక్రమ సింహ భూపతి ఎందుకు ఆగిపోయింది..?

Balayya: బాలయ్య విక్రమ సింహ భూపతి ఎందుకు ఆగిపోయింది..?
Reading Time: 2 minutes
Balayya: బాలయ్య విక్రమ సింహ భూపతి ఎందుకు ఆగిపోయింది..?

మహానటుడు ఎన్టీఆర్ తర్వాత జానపద, చారిత్రిక పాత్రల పోషణలో తనదైన ముద్ర వేసుకున్న నందమూరి బాలకృష్ణ, ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయలుగా, భైరవ ద్వీపంలో జానపద వీరుడిగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆధునిక కాలంలోనూ జానపద చిత్రాలకు ఆదరణ ఉంటుందని నిరూపించారు. ఈ నేపథ్యంలో, బాలకృష్ణతో ఓ అద్భుతమైన జానపద చిత్రాన్ని తీయాలని భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి సంకల్పించారు. బాలకృష్ణకు, భార్గవ్ ఆర్ట్స్ సంస్థకు ఎప్పటి నుంచో బలమైన అనుబంధం ఉంది. నేను బాలయ్య అభిమానినే అని గోపాల్ రెడ్డి బహిరంగంగా ప్రకటించడం, బాలకృష్ణ, కోడి రామకృష్ణ, గోపాల్ రెడ్డి కాంబినేషన్ లో మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య వంటి విజయవంతమైన చిత్రాలు రావడంతో అభిమానులలో విక్రమసింహ భూపతిపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి 2001 జనవరి 9న హైదరాబాద్ లోని తెలుగు లలిత కళా వేదికలో అభిమానుల సమక్షంలో భారీగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమాలో బాలకృష్ణ విక్రమసింహ భూపతి, ఒక యుద్ధ వీరునిగా ద్విపాత్రాభినయం చేస్తారని ప్రకటించారు. రోజా, అంజలా జవేరి, పూజా బాత్రా కథానాయికలుగా, నాజర్, శరత్ బాబు, విజయ్ చందర్, ఎల్.బి శ్రీరామ్, కే.ఆర్. విజయ వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య తారాగణంగా ఎంపికయ్యారు. విక్రమసింహ భూపతి అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు.

చిత్ర యూనిట్ రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేసి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. సినిమాలో రెండు భారీ యుద్ధ ఘట్టాలు ఉంటాయని, వాటిలో ఒకటి రాజస్థాన్ లో, మరొకటి అరకు లోయలో చిత్రీకరించాలని ప్రణాళికలు రచించారు. ముఖ్యంగా, అరకు లోయలో చిత్రీకరించాల్సిన యుద్ధ సన్నివేశాన్ని ఇంటర్వెల్ సన్నివేశంగా రూపొందించి, భారతీయ తెరపై అంతవరకు ఎవరూ చూడని రీతిలో అత్యంత భారీగా తీయడానికి గోపాల్ రెడ్డి ప్రణాళికలు వేశారు. అలాగే, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, ఒక పాట, కొంత యాక్షన్ పార్ట్ చిత్రీకరించడం కోసం వైజాగ్ లోని కొండల మధ్య ఒక రాజనగర్ సెట్ ను కూడా ఏర్పాటు చేశారు. రామోజీ ఫిలిం సిటీలోని అతిపెద్ద ఫ్లోర్ ను అద్దెకు తీసుకుని మరో భారీ సెట్ ను నిర్మించారు. అయితే, ఈ భారీ ప్రణాళికలు, అంచనాల మధ్య అనూహ్యంగా విక్రమసింహ భూపతి చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. రామోజీ ఫిలిం సిటీలోని భారీ సెట్ లో ఒక్క రోజు కూడా షూటింగ్ జరగలేదు. వైజాగ్ లో వేసిన రాజనగర్ సెట్ లో కూడా షూటింగ్ జరగలేదు. ఈ చిత్ర నిలుపుదలకు రకరకాల కారణాలు చెబుతారు. కొందరు హీరో, నిర్మాత మధ్య విభేదాలు తలెత్తాయని పేర్కొనగా, మరికొందరు హీరో, దర్శకుడి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని చెబుతారు. దీని వెనుక నిజమైన కారణాలు ఇప్పటికీ ప్రకటితం అవ్వలేదు. ఏది ఏమైనప్పటికీ.. ఈ సినిమా ఆగిపోవడం నిర్మాత గోపాల్ రెడ్డికి ఇబ్బందిని కలిగించింది. సినిమాను పూర్తి చేయలేకపోవడం అనే మనోవేదన ఆయనను చాలా కాలం వెంటాడింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఆయనకు డేట్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్టులు కూడా కార్యరూపం దాల్చలేదు. విక్రమసింహ భూపతి తెలుగు సినీ చరిత్రలో ఒక అసంపూర్ణ కలగా మిగిలిపోయింది.