ఆడపడుచులా గోమాతకు శ్రీమంతం..రేణిగుంటలో కనులపండువగా జరిగిన వేడుక

హిందూ సాంప్రదాయంలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది.ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు నమ్ముతారు. సరిగ్గా ఇదే నమ్మకంతో, మూగజీవంపై తమకున్న అపారమైన ప్రేమాభిమానాలను చాటుకున్నారు ఓ కుటుంబ సభ్యులు.
రేణిగుంట మండలం కుర్రకాలువ గ్రామానికి చెందిన బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వేణు ముదిరాజ్, జి.పాళ్యం మాజీ సర్పంచ్ కుర్రకాలువ రాణేమ్మల కుటుంబంలో ఈ అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. తమ ఇంట్లోని గర్భంతో ఉన్న గోమాతను వారు తమ సొంత ఆడపడుచులా భావించారు. సోమవారం సాయంత్రం శుభ ముహూర్తాన.. గ్రామంలోని ముత్తైదువుల చేతుల మీదుగా ఆవుకు ఘనంగా శ్రీమంతం వేడుకను నిర్వహించారు.
ఈ వేడుకలో భాగంగా గోమాతకు పసుపు, కుంకుమలు పెట్టి, రంగురంగుల పూలమాలలతో ఎంతో అందంగా ముస్తాబు చేశారు. అనంతరం శ్రీమంతం భోజనంగా ఆవుకు ఇష్టమైన తినుబండారాలు, రకరకాల పండ్లు, ప్రత్యేక పశుగ్రాసాన్ని తినిపించి తమ భక్తిని, ప్రేమను చాటుకున్నారు. ఈ వినూత్న వేడుకను చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం ఈ గోమాత శ్రీమంతం వేడుక స్థానికంగా అందరి హృదయాలను గెలుచుకుంటోంది.