Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్‌కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!

టాలీవుడ్‌లో సరికొత్త హారర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు కేవలం దెయ్యాల కథలతో భయపెడితే.. ఇప్పుడు టెక్నికల్ వాల్యూస్, అదిరిపోయే సౌండ్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను అందిస్తున్నారు మేకర్స్. ఈ కోవలోనే, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త భయానక అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది ‘అమెన్’. ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై, రేగుల నీరజరాణి సమర్పణలో, ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. దర్శక నిర్మాత ఎస్కే బషీద్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మించడం విశేషం. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు టాలీవుడ్‌లో వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్‌ను పూర్తిగా మార్చేలా ‘అమెన్’ చిత్రాన్ని రూపొందించాం. సరికొత్త సస్పెన్స్, అస్సలు ఊహించని భయానక ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో, సరికొత్త విజువల్స్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎంతలా భయపెడుతుందో మాటల్లో చెప్పలేం. అందుకే ముందే హెచ్చరిస్తున్నాం.. గుండె జబ్బులు (హార్ట్ ప్రాబ్లమ్స్) ఉన్నవాళ్లు ఎవరూ థియేటర్‌కు రావద్దు. ఒంటరిగా కూర్చుని ఈ సినిమాను చూసే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన ఒక భయానక అనుభవం. ఔట్‌పుట్‌పై మాకు ఉన్న పూర్తి నమ్మకంతోనే ఈ చిత్రాన్ని మేమే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.