July 15, 2026

Video : ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఫ్రాన్స్ ఔట్.. రణరంగంగా మారిన పారిస్ వీధులు

Video : ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఫ్రాన్స్ ఔట్.. రణరంగంగా మారిన పారిస్ వీధులు
Reading Time: 2 minutes
Video : ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఫ్రాన్స్ ఔట్.. రణరంగంగా మారిన పారిస్ వీధులు

Video : ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ జట్టు ప్రయాణం ముగిసింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్ పోరులో బలమైన స్పెయిన్ చేతిలో ఫ్రాన్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో టోర్నమెంట్ నుంచి ఫ్రాన్స్ నిష్క్రమించగా, స్పెయిన్ గర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే ఈ ఓటమిని ఫ్రాన్స్ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగర వీధులు రణరంగంగా మారాయి. తమ జట్టు ఓడిపోయిందనే నిరాశతో వందలాది మంది మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి దాడులకు దిగారు. కార్లను, దుకాణాలను తగులబెడుతూ అల్లర్లకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

పారిస్ రోడ్లపై ఫ్రాన్స్ అభిమానులు చేసిన హంగామాతో అక్కడ తీవ్ర అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. వైరల్ అవుతున్న దృశ్యాలలో రోడ్లపై పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటం, ప్రజలు ప్రాణభయంతో అటు ఇటు పరుగులు తీయడం కనిపిస్తోంది. పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. అయినప్పటికీ గుంపు వెనక్కి తగ్గకపోవడంతో చివరకు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సైనిక పరేడ్ సందర్భంగా ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. కానీ, జట్టు ఓడిపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

ఈ కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో స్పెయిన్ జట్టు మొదటి నుంచి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. ఫ్రాన్స్ పై 2-0 తేడాతో విజయం సాధించి జయభేరి మోగించింది. స్పెయిన్ ఆటగాళ్లు మ్యాచ్ లో మూడు సార్లు బంతిని గోల్ పోస్ట్‌కు చేర్చారు. అయితే అందులో ఒకటి ఆఫ్‌సైడ్ కావడం వల్ల అంపైర్లు దానిని చెల్లనిదిగా ప్రకటించారు. అయినప్పటికీ మిగతా రెండు గోల్స్ తో స్పెయిన్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాప్పేకు గోల్ చేయడానికి మూడు సువర్ణ అవకాశాలు లభించినప్పటికీ, స్పెయిన్ బలమైన డిఫెన్స్‌ను అతడు ఛేదించలేకపోయాడు. ఒక్క అవకాశం కూడా గోల్‌గా మారలేదు.

ఇది కూడా చదవండి: సూర్యకుమార్ కాదు, తిలక్ వర్మ అంతకన్నా కాదు.. కొత్త కెప్టెన్‌గా టీమిండియా తోపు ప్లేయర్..?

ఈ టోర్నమెంట్ మొత్తంలో స్పెయిన్ జట్టు రక్షణ శ్రేణి (Defence) ఎంత బలంగా ఉందంటే.. ఇప్పటివరకు కేవలం బెల్జియం జట్టు మాత్రమే స్పెయిన్ కు వ్యతిరేకంగా ఒక గోల్ చేయగలిగింది. బెల్జియం మినహా ఏ ఇతర జట్టు కూడా ఈ ప్రపంచకప్‌లో స్పెయిన్ రక్షణ వలయాన్ని దాటి గోల్ కొట్టలేకపోయింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఫ్రాన్స్ కూడా స్పెయిన్ ముందు మోకరిల్లక తప్పలేదు. ఈ ఘోర పరాజయం ఒకవైపు ఫ్రాన్స్ ఆటగాళ్లను కృంగదీయగా మరోవైపు దేశవ్యాప్తంగా క్రీడా అభిమానుల ఆగ్రహజ్వాలలకు కారణమైంది. ప్రస్తుతానికి పారిస్ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.