అయ్యో పాపం: బాల్ కోసం వెళ్లి బావిలో పడి స్టూడెంట్ మృతి..పెద్దపల్లి జిల్లాలో ఘటన

- లింగాపూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, పీఈటీపై సస్పెన్షన్ వేటు
జ్యోతినగర్, వెలుగు : క్రికెట్ బాల్ కోసం వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని లింగాపూర్మోడల్స్కూల్వద్ద బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… రామగుండం 23వ డివిజన్ ఎన్టీపీసీ ఖాజీపల్లి గ్రామానికి చెందిన వెంచర్ల మధు, రజిత దంపతుల కుమారుడు సాత్విక్ (13) లింగాపూర్ మోడల్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.
బుధవారం సాయంత్రం స్కూల్ముగిసే సమయంలో స్నేహితులతో కలిసి గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో బాల్ గోడ అవతలి వైపు ఉన్న బావిలో పడింది. సాత్విక్ బయటకు వెళ్లి బాల్ తీసేందుకు ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాడు. విషయం తెలుసుకున్న రామగుండం ఎస్సై సంధ్యారాణి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో బావిలో నుంచి సాత్విక్ డెడ్ బాడీని బయటకు తీయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రిన్సిపాల్, పీఈటీ సస్పెన్షన్
బాలుడు సాత్విక్ మృతికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. వీరికి స్థానిక కార్పొరేటర్ నిమ్మరాజుల రజిని రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెండ్యాల మహేశ్, బీఆర్ఎస్ నాయకులు ఎంచర్ల మహేశ్, విద్యార్థి సంఘాల నాయకులు మద్దుతు పలికారు.
విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజు రాకూర్ ఆఫీసర్లతో మాట్లాడారు. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్ సదానందంతో పాటు పీఈటీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం, రూల్స్ ప్రకారం ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని పెద్దపల్లి ఆర్డీవో, ఏసీపీ రమేశ్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.