SIR ఫారమ్ నింపుతున్నారా?.. 2002 ఓటరు జాబితా వివరాలు లేకున్నా పర్లేదు:ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో

ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఫారాలపై ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో ఓటర్లకు క్లారిటీ ఇచ్చారు. చాలామంది ఓటర్లు 2002 నాటి తమ తల్లిదండ్రులు లేదా గ్రాండ్ పేరెంట్స్ ఓటర్ వివరాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారని.. అయితే, ఆ వివరాలు లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన చెప్పారు.
2002 నాటి పాత వివరాలు లభించని వారు.. ఎస్‌ఐఆర్ (SIR) ఫారంలోని థర్డ్ పార్ట్ లో తమ ప్రస్తుత వివరాలను నింపి సమర్పిస్తే సరిపోతుందని కమిషనర్ వెల్లడించారు. పాత వివరాలు లేవనే సాకుతో ఫారం సమర్పించకుండా అస్సలు ఆలస్యం చేయవద్దని సూచించారు.
2002 నాటి వివరాలు ఇవ్వని వారికి వచ్చే ఆగస్టు నెలలో నోటీసులు వస్తాయని కమిషనర్ తెలిపారు. అయితే ఆ నోటీసు చూసి కంగారు పడాల్సిన అవసరం లేదని.. నోటీసు వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ సూచించిన 11 రకాల గుర్తింపు పత్రాలలో (ID Proofs) ఏదైనా ఒకదానిని సమర్పిస్తే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ మీ దగ్గర 2002 నాటి వివరాలు ఉంటే తప్పకుండా నింపండి.. లేకపోతే ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలేయండి. కానీ వివరాలు లేవనే కారణంతో ఫారాలను బీఎల్‌వో (BLO)లకు ఇవ్వకుండా ఆలస్యం చేయొద్దని, వీలైనంత త్వరగా ఎస్‌ఐఆర్ ఫారాలను పూర్తి చేసి స్థానిక బీఎల్‌వోలకు అందజేయాలని వికాస్ మహతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.