Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?

Off The Record: నేను ఆశించింది ఇవ్వట్లేదు కాబట్టి… నేనింతే అన్న ధోరణిలో కొంతమంది నేతలున్నట్టు భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. అలాంటి వాళ్ళలో విజయశాంతి ఒకరన్నది ముఖ్య నేతల ఫీలింగ్ అట. గడిచిన కొద్ది రోజులుగా అడపా దడపా విజయశాంతి చేస్తున్న ట్వీట్స్ కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టేలా ఉన్నాయని అంటున్నారు. తాజాగా… షాబాద్ ఘటనపై విజయశాంతి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్నాయని pcc భావిస్తోందట. ఆమెతో పాటు రేణుకా చౌదరి వ్యాఖ్యలపై కూడా పార్టీ కొంత సీరియస్‌గానే ఉందని అంటున్నారు. ఎమ్మెల్సీ అయ్యాక విజయశాంతి మంత్రి పదవి ఆశించినట్టు ప్రచారం జరిగింది. ఆ విషయం ఎటూ తేలకపోవడం, అంతులేని జాప్యం జరుగుతుండటంతో తన అసంతృప్తిని ఇలా బయటపెడుతున్నారని, ధిక్కార స్వరం వినిపిస్తున్నారంటూ గాంధీ భవన్‌లో చర్చ జరుగుతోంది.
ఐతే… విజయశాంతి ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి… పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనక పోవడం… ఎంపీ ఎన్నికల ప్రచారంలో కూడా కనిపించకపోవడం లాంటి వాటికి తోడు… పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారన్న భావన కాంగ్రెస్ పెద్దల్లో ఉందట. అధిష్టానం నుండి ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయిన విజయశాంతి … ఇక్కడ ఏం జరిగినా హస్తినలో చెప్పుకోవచ్చనే ధీమాతో ఉన్నారనే ఇంకో వెర్షన్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేసిన వారిని కాదని… పదవులు ఇస్తే ఇలాగే ఉంటుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు కూడా. అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, సొంత సభ్యులు ప్రభుత్వానికి నేరుగా సలహాలు ఇవ్వచ్చుగానీ… సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పలచన చేయడం ఏంటని మాట్లాడుకుంటున్నారు గాంధీభవన్‌సో. ఇలాంటి చర్యలన్నీ ప్రతిపక్షాని అవకాశం ఇవ్వడమేనన్నది పీసీసీ ఫీలింగ్.