చిరుతల చావుకేక!..ఐదేండ్లలో 40కి పైగా చిరుతలు, మరో ఆరు పెద్దపులులు హతం

- తాజాగా నిజామాబాద్ అడవుల్లో రెండు చిరుతపులుల మృతి
- ‘జే1’ పులి ఆచూకీ కోసం వెతుకుతుంటే బయటపడ్డ కళేబరాలు
- టైగర్, చిరుతల ట్రాకింగ్‌లో అటవీశాఖ వైఫల్యం
- రాష్ట్ర అడవుల్లో ప్రశ్నార్థకంగా వన్యప్రాణుల మనుగడ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అడవుల్లో మరణ మృదంగం మోగుతున్నది. రక్షిత అరణ్యాల్లోనూ వన్యప్రాణులకు రక్షణ కరువవుతోంది. ఒకవైపు అడవులు అంతరించిపోతుంటే.. మరోవైపు వేటగాళ్ల ఉచ్చులకు, కరెంట్తీగలకు, అధికారుల నిర్లక్ష్యానికి మూగజీవాలు బలవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం వన్యప్రాణుల రక్షణ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడంలేదు. గడిచిన ఐదేళ్లలో తెలంగాణ అటవీ ప్రాంతాల్లో సుమారు 40కి పైగా చిరుతపులులు, ఆరు పెద్దపులులు మృత్యువాత పడటం కలవరపరుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో తాజాగా వెలుగుచూసిన రెండు చిరుత పులుల మృతి ఘటన అటవీశాఖను కుదిపేస్తున్నది. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ‘జే1’ పులి ఆచూకీ కోసం అన్వేషిస్తుండగా.. రెండు చిరుతల కళేబరాలు బయటపడటం అటవీశాఖ పనితీరుకు అద్దం పడుతోంది. కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో భీంగల్‌లో ఒకటి.. ధర్పల్లి మండలంలో మరొకటి చిరుత పులి కళేబరాలు లభించాయి. దీనికితోడు గతేడాది వచ్చిన పెద్దపులి (ఎస్12 ) మిస్సింగ్ మిస్టరీగా మారింది. పెద్ద పులిని ట్రాక్చేయడంలో సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ముప్పేట దాడిలో మూగజీవాలు
రాష్ట్రంలో చిరుత పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘స్టేటస్ ఆఫ్ లియోపార్డ్స్ ఇన్ ఇండియా’ నివేదిక ప్రకారం తెలంగాణలో చిరుతల సంఖ్య 350పైగా ఉన్నా వాటి ఆవాసాలు దెబ్బతిన్నాయి. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో దాదాపు 40పైగా చిరుతలు వివిధ కారణాలతో చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇక్కడ ఎక్కువగా విద్యుత్ వైర్ల ఉచ్చులకు చిక్కి చిరుతలు మరణిస్తున్నాయి. అడవి పందుల కోసం వేటగాళ్లు పెట్టే కరెంటు వైర్లు వీటికి శాపంగా మారాయి. దక్షిణ తెలంగాణలోని నల్లమల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వాహనాలు రోడ్డు ప్రమాదాలు, విష ప్రయోగాల వల్ల మరణాలు నమోదవుతున్నాయి. మైనింగ్, గ్రానైట్ క్వారీలు, పోడుసాగు పేరుతో అడవులను నరికేయడంతో చిరుతలు నిలువ నీడ లేక జనావాసాల్లోకి వస్తున్నాయి. అడవిలో జింకలు, పందుల సంఖ్య తగ్గడంతో ఆకలి తీర్చుకోవడానికి గ్రామాల్లోని పశువుల మందలపై పడుతున్నాయి. దీనికితోడు వేసవిలో అడవిలోని వాగులు ఎండిపోవడంతో దాహం తీర్చుకోవడానికి జనావాసాల్లోని కుంటల వద్దకు వస్తున్నాయి.
ఆవాసాలు ఉన్నా.. భరోసా లేదు!
రాష్ట్రంలోని అటవీ భూభాగం, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా చిరుతలు ప్రధానంగా కొన్ని జిల్లాలను తమ అడ్డాలుగా మార్చుకున్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లాలో చిరుత పులులున్నాయి. ఇక్కడ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. చిరుతలకు కావాల్సిన రాతి గుట్టలు, దట్టమైన పొదలు సమృద్ధిగా ఉన్నాయి. రాష్ట్రంలోని మొత్తం చిరుతల్లో దాదాపు 30 నుంచి 40 శాతం ఈ ప్రాంతంలోనే ఉన్నాయని అంచనా. ఉత్తర తెలంగాణలోని నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌తోపాటు కవ్వాల్ టైగర్ రిజర్వ్, దాని పరివాహక ప్రాంతాలు చిరుతలకు ప్రధాన ఆవాసాలు. మహారాష్ట్రలోని తడోబా అడవుల నుంచి పులులు, చిరుతలు ఈ జిల్లాల్లోకి వలస వస్తుంటాయి. మంచిర్యాలలోని బెల్లంపల్లి, చెన్నూర్ అడవుల్లో చిరుతల కదలికలు ఎక్కువ. ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యం, తాడ్వాయి అడవులు గోదావరి తీర ప్రాంతంలోని దట్టమైన అడవులు కావడంతో ఇక్కడ చిరుతలకు కావాల్సిన ఆహారం జింకలు, అడవి పందులు పుష్కలంగా దొరుకుతాయి. అనంతగిరి గుట్టలు, దామగుండం అటవీ ప్రాంతంలో అడవి తక్కువగా ఉన్నప్పటికీ రాతి గుట్టలు ఎక్కువగా ఉండటం చిరుతలకు అనుకూలంగా మారింది. అందుకే తరచూ ఇక్కడి చిరుతలు హైదరాబాద్ శివార్లలోని గండిపేట లేదా రాజేంద్రనగర్ వైపు వస్తుంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల,రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లోని వేములవాడ, కొండగట్టు గుట్టల ప్రాంతం. ఇక్కడ గుట్టల మీద చిరుతల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ జిల్లాల్లోనే చిరుతలు ఎక్కువగా జనావాసాల్లోకి వచ్చి పశువులపై దాడి చేస్తున్న ఘటనలు నమోదవుతున్నాయి. మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పోచారం వన్యప్రాణి అభయారణ్యంలో చిరుతల సాంద్రత ఎక్కువగా ఉంది. చిరుతలు పులులలాగా కేవలం దట్టమైన అడవుల్లోనే ఉండవు. రాతి గుట్టలు, చిన్న పొదలు ఉన్నచోట సులభంగా వేటాడుతాయి. నాగర్ కర్నూల్, వికారాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఇలాంటి గుట్టలు ఎక్కువ. గ్రామాలకు దగ్గరగా ఉండే అటవీ ప్రాంతాల్లో కుక్కలు, మేకలు సులభంగా దొరుకుతుండటంతో చిరుతలు ఆయా జిల్లాల సరిహద్దుల్లో స్థిరపడుతున్నాయి.
‘డ్రోన్’ నిఘా ఏదీ..?
అటవీ శాఖ ‘కాంపా’ నిధుల కింద వన్యప్రాణుల సంరక్షణ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం కనిపించడంలేదు. డ్రోన్ టెక్నాలజీతో వేటగాళ్లను పట్టుకుంటామని చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అడవిలో బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ గార్డుల పెట్రోలింగ్ నామమాత్రంగానే సాగుతుండడం, అటవీ నిధులు క్షేత్రస్థాయిలో పని చేసే వాచ్‌మెన్లకు, ట్రాకర్లకు అందకపోవడంతో వారు కూడా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే వాదనలున్నాయి. చిరుతల దాడిలో పశువులు చనిపోతే రైతులకు వెంటనే పరిహారం అందించాలి. లేదంటే ఆగ్రహంతో రైతులు చిరుతలపై విష ప్రయోగాలు చేస్తున్నారు. అడవుల మధ్యలో ఉండే గ్రామాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. వన్యప్రాణులను వేటాడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగించాలి. కానీ అటవీ అధికారుల నిర్లక్ష్యం వన్యప్రాణుల ప్రాణం మీదికి తెస్తోంది.