July 15, 2026

Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు

Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
Reading Time: < 1 minute
Pawan Kalyan Writes To Ap Cs Dgp On Effective Pocso Act Implementation

Deputy CM Pawan Kalyan: రాష్ట్రంలో పోక్సో (POCSO) చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ (సీఎస్) మరియు డీజీపీకి లేఖ రాశారు. చిన్నారులపై జరిగే లైంగిక నేరాల కేసుల్లో సమయపాలనతో దర్యాప్తు, బాధితుల రక్షణ, సాక్ష్యాల పరిరక్షణ, కేసుల పర్యవేక్షణ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రతి చిన్నారికి భద్రత, గౌరవం, భయరహిత జీవనం రాజ్యాంగబద్ధమైన హక్కు అని పవన్ లేఖలో పేర్కొన్నారు. పోక్సో కేసులను అత్యున్నత ప్రాధాన్యంతో విచారించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని కూడా ఆయన అధికారులకు గుర్తుచేశారు.

నెల్లూరు జిల్లా రెహ్మతాబాద్ దర్గా వ్యవహారానికి సంబంధించి ముస్లిం మత పెద్దలు, స్థానికులు, భక్తులు, ముస్లిం సమాజ సభ్యుల నుంచి తనకు వినతులు అందినట్లు పవన్ కల్యాణ్‌ తెలిపారు. పోక్సో కేసు ఎదుర్కొంటున్న సజ్జాదా నషీన్ ఇప్పటికీ ఆధ్యాత్మిక బాధ్యతలు నిర్వహిస్తున్నారనే అంశాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని వక్ఫ్ బోర్డు, జిల్లా యంత్రాంగానికి పోలీసులు అధికారికంగా తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. అలాగే పోక్సో కేసుల్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులను బెదిరించే ఘటనలను తీవ్రంగా పరిగణించాలని, అలాంటి చర్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పోక్సో బాధితులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడంతో పాటు, న్యాయం త్వరితగతిన అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తన లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. కాగా, ముంబైలో శస్త్ర చికిత్స పూర్తి చేసుకున్న పవన్‌ కల్యాణ్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి హైదరాబాద్‌ చేరుకోని విశ్రాంతి తీసుకోనున్నారు.. కానీ, వివిధ అంశాలపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు..