July 17, 2026

India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!

India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
Reading Time: 2 minutes
Shubman Gill Disappointed After Indias Odi Loss To England Admits Batting Collapse Cost The Match

India vs England: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలవడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓటమిపై స్పందిస్తూ జట్టు చేసిన తప్పులను అంగీకరించాడు. మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని భారీ స్కోరుగా మలచలేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.

అయితే, టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలో భారత్ జాగ్రత్తగా ఆడినా, విరాట్ కోహ్లీ (65), శ్రేయస్ అయ్యర్ (66) అర్ధశతకాలతో జట్టును మంచి స్థితికి తీసుకెళ్లారు. ఒక దశలో భారత్ 300 నుంచి 310 పరుగులు చేసే స్థితిలో కనిపించింది. అయితే మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఫలితంగా భారత్ కేవలం 233 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినా, అనుభవజ్ఞుడు జో రూట్ మరోసారి తన క్లాస్‌ను ప్రదర్శించాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో అజేయంగా 99 పరుగులు చేసిన రూట్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. విల్ జాక్స్, సామ్ కరన్‌తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ ఇంగ్లండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో గెలిపించాడు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్, “నిజం చెప్పాలంటే ఈ ఓటమి చాలా నిరాశ కలిగించింది. తొలి 25 ఓవర్ల తర్వాత మేం 300 నుంచి 310 పరుగులు చేయగలమని భావించాం. కానీ, మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మా టెయిలెండర్లు గొప్ప బ్యాటర్లు కాదన్న విషయం తెలుసు. అయినప్పటికీ లోయర్ మిడిల్ ఆర్డర్ నుంచి మరింత మెరుగైన సహకారం ఆశించాం. మాకు లభించిన మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మార్చుకోలేకపోయాం” అని పేర్కొన్నాడు.

భారత్ ఇప్పటికే ఈ సిరీస్‌లో తొలి వన్డేను గెలవగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయంతో సిరీస్ సమమైంది. దీంతో జూలై 19న లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరిగే మూడో వన్డే నిర్ణయాత్మకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. అయితే, భారత్ చివరి వన్డేలో బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ బాధ్యతగా ఆడితేనే జట్టుకు విజయావకాశాలు మెరుగుపడతాయి. మరోవైపు ఇంగ్లండ్ కూడా అదే జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. లార్డ్స్ వేదికగా జరిగే ఈ పోరుపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.