E20 పెట్రోల్ వివాదం: గ్రాండ్ విటారా కేసులో మారుతి కీలక నిర్ణయం.. కోర్టు ఆదేశాలపై అప్పీల్

దేశంలోనే తొలిసారిగా E20 పెట్రోల్‌కు సంబంధించిన కేసులో వినియోగదారుల కోర్టు ఇచ్చిన కీలక తీర్పును కార్ల దిగ్గజం మారుతి సుజుకి సవాల్ చేయాలని నిర్ణయించింది. గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎస్‌యూవీని కొత్త వాహనంతో మార్చాలని లేదా కస్టమర్ కు రూ.20లక్షల 50 వేలను తిరిగి చెల్లించాలని రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తమ వాహనం పూర్తిగా E20 పెట్రోల్‌కు అనుకూలమేనని, సమస్యకు కారణం వాహనం కాదు.. కలుషితమైన పెట్రోల్ వాడటమేనని మారుతి సుజుకి చెబుతోంది.
అసలు వివాదం ఎలా మొదలైంది?
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన డాక్టర్ ప్రేమ్‌రాజ్ దేబ్తా 2024 జూన్‌లో గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ జీటా+ మోడల్‌ను కొనుగోలు చేశారు. అయితే వాహనం కొనుగోలు చేసిన 5 నెలల్లోనే తరచూ ఇంజిన్ ఆగిపోవడం, పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురయ్యాయని ఫిర్యాదు చేశారు. పలుమార్లు అధికారిక సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లినా సమస్య శాశ్వతంగా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
ఇంధన పరీక్షలో ఏమి బయటపడింది?
సర్వీస్ సెంటర్ సిబ్బంది పలుమార్లు ఫ్యూయల్ ట్యాంక్‌ను శుభ్రం చేసినప్పటికీ అదే సమస్య మళ్లీ మళ్లీ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయోగశాలలో ఇంధన నమూనాను పరీక్షించగా, అందులో తెల్లటి పెరుగు మాదిరి పదార్థం కనిపించిందని, అది ఇథనాల్‌కు సంబంధించినదేనని నివేదికలో వెల్లడైంది. అలాగే వాహనం కొనుగోలు సమయంలో E20 పెట్రోల్ వినియోగానికి సంబంధించిన పూర్తి సమాచారం తమకు ఇవ్వలేదని డాక్టర్ దేబ్తా ఆరోపించారు.
వినియోగదారుల కోర్టు కీలక ఆదేశాలు
రెండు వర్గాల వాదనలు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ పరిశీలించిన రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల కమిషన్.. అనేకసార్లు రిపేర్స్ చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో వినియోగదారులకు దానిని ఉపయోగించడం తప్ప మరో మార్గం లేదని కూడా కమిషన్ పేర్కొంది. దీంతో 45 రోజుల్లోపు కొత్త E20 అనుకూల వాహనాన్ని ఇవ్వాలని, లేదంటే వాహనం ధర, ఆర్‌టీవో ఫీజులు, ఇన్సూరెన్స్ కలిపి రూ.20 లక్షల 50వేలు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా మానసిక వేధింపులకు రూ. లక్ష, న్యాయపరమైన ఖర్చులకు రూ.10 వేల పరిహారం చెల్లించాలని కూడా స్పష్టం చేసింది.
మారుతి సుజుకి వాదన ఇదే..
ఈ తీర్పుపై మారుతి సుజుకి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సంబంధిత వాహనం పూర్తిగా E20 పెట్రోల్‌కు అనుకూలంగా రూపొందించబడిందని, ఈ విషయం యజమాని మాన్యువల్‌లో కూడా స్పష్టంగా పేర్కొన్నామని తెలిపింది. వినియోగదారుడి వాహనం నుంచి సేకరించిన ఇంధనంలో కలుషిత పదార్థాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని, ఈ కీలక అంశాలను కమిషన్ తన తీర్పులో సరిగా పరిగణనలోకి తీసుకోలేదని కంపెనీ అంటోంది. సో ఈ వ్యవహారంపై పైకోర్టును ఆశ్రయించాలని మారుతి ఫిక్స్ అయ్యింది.
ALSO READ : 2027 నుంచి కొత్త మైలేజ్ నిబంధనలు, ఈవీలు–హైబ్రిడ్ కార్లకు భారీ ప్రోత్సాహం!
పైకోర్టును ఆశ్రయించనున్న కంపెనీ..
రాయ్‌పూర్ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వును ఉన్నత న్యాయ వేదికలో సవాల్ చేస్తామని మారుతి సుజుకి అధికారికంగా ప్రకటించింది. చట్టపరంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించి ఈ కేసులో అప్పీల్ దాఖలు చేస్తామని తెలిపింది. భారత ఆటోమొబైల్ రంగంలో E20 ఇంధన వినియోగంపై ఇదే తొలి ప్రధాన న్యాయ వివాదంగా మారడంతో, ఈ కేసు తుది తీర్పు భవిష్యత్తులో వాహన తయారీ సంస్థలు, వినియోగదారులు, అలాగే ఇంధన విధానాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.