July 17, 2026

IND vs ENG 2nd ODI: ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత్ తడబాటు.. 233 పరుగులకే టీమిండియా ఆలౌట్

IND vs ENG 2nd ODI: ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత్ తడబాటు.. 233 పరుగులకే టీమిండియా ఆలౌట్
Reading Time: 2 minutes
IND vs ENG 2nd ODI: ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత్ తడబాటు.. 233 పరుగులకే టీమిండియా ఆలౌట్

IND vs ENG 2nd ODI: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ దాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ తలవంచక తప్పలేదు. నిర్ణీత 44 ఓవర్లలో భారత్ 233 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మొదటి వన్డేలో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌లో మాత్రం భారీ స్కోరు చేయలేకపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్ భారత బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టారు.

భారత ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఆటతీరును ప్రదర్శించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా ఆడిన కోహ్లీ 66 బంతుల్లో 65 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు ఉన్నాయి. అతనికి తోడుగా శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుత పోరాటం చేసి హాఫ్ సెంచరీ మార్కును దాటాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కీలకమైన హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. అయితే జట్టు స్కోరు 190 పరుగుల వద్ద ఉన్నప్పుడు విరాట్ కోహ్లీని జోఫ్రా ఆర్చర్ అవుట్ చేయడంతో భారత్ కోలుకోలేకపోయింది.

ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు జట్టుకు ఆశించిన స్థాయిలో మంచి భాగస్వామ్యాన్ని ఇవ్వలేకపోయారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 30 బంతుల్లో 31 పరుగులు చేసి అట్కిన్సన్ బౌలింగ్‌లో ఎనిమిదో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ కాస్త నెమ్మదిగా ఆడి 47 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి సామ్ కరన్ బౌలింగ్‌లో దొరికిపోయాడు. దీనితో 21 ఓవర్లకే భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.

ఇన్నింగ్స్ మధ్యలో శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికీ లోయర్ ఆర్డర్ నుంచి అతనికి సరైన మద్దతు లభించలేదు. వాషింగ్టన్ సుందర్ 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి సాకిబ్ మహమూద్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 36వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన జోఫ్రా ఆర్చర్ వరుస బంతుల్లో అక్షర్ పటేల్, శివమ్ దూబేలను అవుట్ చేసి భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అక్షర్ ఒక పరుగు చేయగా, దూబే కనీసం ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఆఖర్లో గుర్నూర్ బ్రార్ 15 బంతుల్లో 7 పరుగులు చేసి ఎనిమిదో వికెట్‌గా అవుటయ్యాడు.

చివరి వికెట్లకు పరుగులు రావడం కష్టంగా మారిన సమయంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బ్యాట్‌తో అద్భుత విన్యాసాలు చేశాడు. సాకిబ్ మహమూద్ వేసిన ఓవర్లో బుమ్రా రెచ్చిపోయి ఆడాడు. ఆ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు, ఒక భారీ సిక్సర్ బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. బుమ్రా వేగంగా ఆడటం వల్లే భారత్ స్కోరు 230 దాటగలిగింది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తుందనే అంచనాతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టుగానే వారి బౌలర్లు రాణించారు. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేశాయి. ఇంగ్లాండ్ జట్టులో జోష్ టంగ్, లియామ్ డాసన్ స్థానాల్లో సాకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్‌లకు అవకాశం దక్కింది. భారత్ తరఫున గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో ఈషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి