July 15, 2026

మహారాష్ట్రలో 2.3 కోట్ల లీటర్ల కల్తీపాలు.. సర్ఫ్, పామాయిల్, కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారీ

మహారాష్ట్రలో 2.3 కోట్ల లీటర్ల కల్తీపాలు.. సర్ఫ్, పామాయిల్, కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారీ
Reading Time: 2 minutes

మహారాష్ట్రలో 2.3 కోట్ల లీటర్ల కల్తీపాలు.. సర్ఫ్, పామాయిల్, కెమికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తయారీ

Caption of Image.
  • 6 నెలల్లో రూ.9.21 కోట్ల విలువైన కల్తీ పాల అమ్మకం..
  • ఏడుగురిపై కేసు.. పరారీలో నిందితులు.. గాలిస్తున్న పోలీసులు

ముంబై: మహారాష్ట్రలో కల్తీపాల దందా కలకలం రేపింది. దాదాపు 2.3 కోట్ల లీటర్లకు పైగా కల్తీ పాలు మార్కెట్లోకి సరఫరా అయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో ఈ కల్తీ వ్యవహారంపై బట్టబయలైంది. పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీ ఏ) జరిపిన విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సేల్స్ రిజిస్టర్లను పరిశీలించగా.. గత ఆరు నెలల్లో సుమారు 2,30,470 కిలోల నాణ్యత లేని మిల్క్ పౌడర్‌‌‌‌‌‌‌‌ను పాల కల్తీ కోసం ఉపయోగించినట్టు తేలింది. 

ఈ భారీ పరిమాణంలో ఉన్న మిల్క్ పౌడర్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించి సుమారు 23,04,070 లీటర్ల కృత్రిమ (సింథటిక్) పాలను తయారు చేశారు. ఈ పాల విలువ దాదాపు 9,21,62,800 రూపాయలుగా అధికారులు అంచనా వేశారు. కాగా, ఈ నెల 11న సతారా జిల్లాలోని దహివాడిలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) దాడులు జరుగుతున్నాయనే ప్రచారంతో పాల సేకరణ కేంద్రాల నిర్వాహకులు వందలాది లీటర్ల పాలను రోడ్లపై పారబోశారు. ఈ హఠాత్​ పరిణామం కల్తీ పాలు విక్రయిస్తున్నారనే అనుమానాలకు బలం చేకూర్చడంతో పాటు, వారి అక్రమ వ్యాపార భయాన్ని అధికారుల ముందుంచింది.

కల్తీ ఎలా చేశారంటే..

నిందితులు ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల కృత్రిమ పాలను కలిపేవారు. ఈ లెక్కన భూమ్ ప్రాంతంలోని పాలు సేకరించే కేంద్రాల నుంచి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు మొత్తం 2.3 కోట్ల (23 మిలియన్ల) లీటర్ల కంటే ఎక్కువ కల్తీ పాలు సరఫరా అయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కల్తీ పాలు అసలైన పాలలా కనిపించడానికి, పాలలో ఫ్యాట్ (కొవ్వు) శాతం కోసం నిందితులు డిటర్జెంట్ పౌడర్, పామాయిల్, నాణ్యత లేని కెమికల్ పౌడర్‌‌‌‌‌‌‌‌ను వాడినట్టు ఆరోపణలు వచ్చాయి. 

డిటర్జెంట్, పామాయిల్ ఉన్న కెమికల్స్ కలిపిన పాలను నిరంతరం తాగడం వల్ల కాలేయం (లివర్), మూత్రపిండాలు (కిడ్నీలు), జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది పిల్లలు, గర్భిణులు, వృద్ధుల ప్రాణాలకే ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

నిందితుల కోసం కొనసాగుతున్న వేట

ఈ కేసులో పోలీసులు ఏడుగురిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, కేసు నమోదై 8 రోజులు గడుస్తున్నా నిందితులంతా ఇంకా పరారీలోనే ఉన్నారు. వారిని పట్టుకునేందుకు భూమ్ పోలీస్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ నేతృత్వంలో స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీం (సిట్) ఏర్పాటు చేశారు. వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆహార భద్రత చట్టం(ఫుడ్ ​సేఫ్టీ యాక్ట్​) ప్రకారం ఇలాంటి ప్రాణాంతక కల్తీకి పాల్పడే వారికి జీవిత ఖైదుతో పాటు రూ.10 లక్షల ఫైన్​ పడే అవకాశం ఉంది.

 ఈ ఘటనపై భూమ్ ఎస్​ఐ శ్రీగణేష్ కనగుడే మీడియాతో మాట్లాడారు. ‘దాడి సమయంలో అధికారులు 61 బస్తాల కల్తీ మిల్క్ పౌడర్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో బాలసాహెబ్ గోడ్గే అనే వ్యక్తి భూమ్ ప్రాంతంలోని పలు డెయిరీ యూనిట్లకు ఈ కల్తీ మిల్క్ పౌడర్‌‌‌‌‌‌‌‌ను సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. ఈ ముఠాతో పలు పాల సేకరణ కేంద్రాలకు కూడా సంబంధాలు ఉన్నట్టు తేలింది. పశుగ్రాసం విక్రయించే నెపంతో ఈ దందా చేశారు. 

ఈ పౌడర్‌‌‌‌‌‌‌‌తో తయారు చేసిన కల్తీ పాలను కొనుగోలు చేసిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. భూమ్ తాలూకా నుంచి ప్రతిరోజూ లక్షల లీటర్ల పాలు ఎగుమతి అవుతుంటాయి. అలాగే, 70 నుంచి 80 టన్నుల కోవా తయారవుతుంది. ఈ కేసు చాలా తీవ్రమైనది’ అని వివరించారు.

©️ VIL Media Pvt Ltd.