July 17, 2026

లబ్ధిదారులకు రిలీఫ్… ‘తల్లికి వందనం’ డబ్బులు ఈనెలలోనే జమ!

లబ్ధిదారులకు రిలీఫ్… ‘తల్లికి వందనం’ డబ్బులు ఈనెలలోనే జమ!
Reading Time: 2 minutes

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎన్నికల హామీల్లో ప్రధానమైన ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22న లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. విద్యాభారంతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద ఉపశమనం కలిగించనుంది.  ఒకటి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు చదువుతున్న ప్రతి అర్హత కలిగిన విద్యార్థికి ఈ పథకం వర్తించనుంది. ఆ వివరాలు చూద్దాం..

ఎవరెవరికి ఎంత లబ్ధి?: ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులతో పాటు 42,70,802 మంది తల్లులు లేదా సంరక్షకులు లబ్ధి పొందనున్నారు. ఇక ప్రతి అర్హ విద్యార్థికి ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సహాయం ప్రకటించగా.. అందులో ఒక్కో విద్యార్థికి రూ.2 వేల చొప్పున పాఠశాలల అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వం మినహాయించనుంది. మిగిలిన రూ.13 వేలు నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.

అర్హుల జాబితా.. షెడ్యూల్ ఇదే: ప్రభుత్వం ప్రకటించిన టైమ్‌లైన్ ప్రకారం.. జూలై 22న తొలి విడతగా 64,76,590 మంది విద్యార్థులకు సంబంధించిన అర్హులు, అనర్హుల జాబితాలను ప్రచురిస్తారు. జూలై 22 నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఇక అనంతరం ఆగస్టు 4 నుంచి 10 వరకు వీటిని పరిశీలించి, అదనపు అర్హుల జాబితాను రెడీ చేస్తారు.

approves talliki vandanam scheme funds to be credited on july 24
approves talliki vandanam scheme funds to be credited on july 24

కొత్త అడ్మిషన్లకూ బంపర్ ఆఫర్: ఇక, ఆగస్టు 25 వరకు ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కూడా ఈ పథకంలో అవకాశం కల్పిస్తారు. ఇక ఆగస్టు 30న ఈ అదనపు అర్హుల జాబితాను విడుదల చేసి, అదే రోజు వారికి కూడా ఆర్థిక సాయం జమ చేయనున్నారు. ఆర్టీఈ (RTE) చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్ పోను మిగిలిన మొత్తాన్ని ‘తల్లికి వందనం’ కింద చెల్లిస్తారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక భారం తగ్గించి, విద్యను మరింత ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.

గమనిక: మీ పిల్లల పేర్లు అర్హుల జాబితాలో ఉన్నాయో లేదో ఈ నెల 22న విడుదలయ్యే లిస్ట్‌లో సరిచూసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పేరు రాకపోతే ఆగస్టు 3 లోపు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

The post లబ్ధిదారులకు రిలీఫ్… ‘తల్లికి వందనం’ డబ్బులు ఈనెలలోనే జమ! appeared first on Manalokam – Latest Telugu News & Updates.