Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..

Nadendla Manohar: గుంటూరు జిల్లా తెనాలిలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తన బలాబలాలను అంచనా వేసుకుని పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, కూటమి బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కూటమి విజయమే ముఖ్యమని, అవసరమైతే ఒక అడుగు వెనక్కు తగ్గేందుకు కూడా జనసేన సిద్ధంగా ఉంటుందని మంత్రి మనోహర్ వెల్లడించారు. అదే సమయంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని, వారికి పోటీ చేసే అవకాశం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అమలైన సీట్ల పంపిణీ ఫార్ములానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొనసాగుతుందన్న ప్రచారాన్ని మంత్రి మనోహర్ ఖండించారు. అప్పటి రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమి నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, అందువల్ల గత ఎన్నికల ఫార్ములా యథాతథంగా అమలవుతుందని చెప్పడం సరైంది కాదని మంత్రి స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలం, రాష్ట్ర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ఇక, జనసేనలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని మంత్రి మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పార్టీలతో సమన్వయం కొనసాగిస్తూ, విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్..