July 14, 2026

Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం

Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
Reading Time: 2 minutes
Shabad Murder Case Meghana Gets Rs10 Lakh Government Aid Rehabilitation

Shabad Murder Case: షాబాద్ ఘోర హత్యాకాండలో తన తల్లి, చెల్లి, నానమ్మను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన మానసిక వికలాంగురాలైన బాలిక మేఘనకు ప్రభుత్వం నుంచి ప్రాథమిక సాయం అందింది. బాధితురాలికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మేఘనకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం చెక్కును స్వయంగా అందజేశారు. ఈ క్రమంలో మేఘన బాబాయ్, చిన్నమ్మ NTVతో మాట్లాడుతూ తమ ఆవేదనను, భయాందోళనలను పంచుకున్నారు. ఆ దారుణ హత్యాకాండ ఇంకా తమను భయపెడుతూనే ఉందని కన్నీరుమున్నీరయ్యారు. గతంలోనే తండ్రిని కోల్పోయిన మేఘన.. ఇప్పుడు ఈ ఘోరంలో తల్లిని, చెల్లిని, నానమ్మను కోల్పోయి పూర్తిగా అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందే కన్నతల్లిని, నానమ్మను నిందితుడు రాజ్‌కుమార్ క్రూరంగా చంపడాన్ని మేఘన స్వయంగా చూసిందని.. నాటి నుంచి తీవ్ర భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతోందని తెలిపారు. రాత్రి కాగానే అమ్మ, నానమ్మ, చెల్లి ఎక్కడ? అని అడుగుతోందని, కనీసం తన సొంత పనులు సైతం చేసుకోలేని స్థితిలో ఉన్న ఆ బాలికను సముదాయించడం తమకు శక్యంగా కావడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. నిందితుడు రాజ్‌కుమార్ సూసైడ్ చేసుకున్నప్పటికీ.. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ ముందు ఆ వార్త తమకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదని స్పష్టం చేశారు.

మేఘన మానసిక వికాసం, భవిష్యత్తు కోసం కలెక్టర్ మూడు ప్రభుత్వ పునరావాస కేంద్రాలను (రిహాబిలిటేషన్ సెంటర్స్) సూచించారని.. వాటిలో సికింద్రాబాద్‌లోని కేంద్రం బాగుండటంతో మేఘనను అక్కడే చేర్పించాలని నిర్ణయించుకున్నట్లు బాబాయ్, చిన్నమ్మ తెలిపారు. ఇంట్లో జరగాల్సిన కొన్ని కార్యక్రమాలు పూర్తి కాగానే ఆమెను తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేస్తామన్నారు. అలాగే మేఘనకు జీవితకాలం పాటు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసుల తీరుపై వారు తీవ్ర అసహనం, అనుమానాలు వ్యక్తం చేశారు. గతంలోనే నిందితుడు రాజ్‌కుమార్‌పై పోక్సో (POCSO) చట్టం కింద ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, అసలు పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ ప్రాంతంలో సరైన పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడం వల్లే ఈ అఘాయిత్యం జరిగిందని మండిపడ్డారు. ఈ కేసులో నిందితుడు రాజ్‌కుమార్‌కు పోలీసులు పూర్తిగా సహకరించారనే బలమైన అనుమానం తమకు ఉందని, ఇదొక విచిత్రమైన పరిస్థితి అని పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలీసులు బాధితుల వైపు నిలబడి న్యాయం చేయాలని, తమకు రక్షణగా ఉండాలని డిమాండ్ చేశారు.