వచ్చే ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీ అడ్మిషన్లు.. 2,500 మందికి అవకాశం : మంత్రి వివేక్

తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సుమారు 54 ఎకరాల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్..రాబోయే డిసెంబర్ సమ్మిట్‌ను ఈ స్కిల్ యూనివర్సిటీలోనే నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. ఈ సమ్మిట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి ఒక మంచి అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అక్టోబర్ చివరి నాటికి అకాడమిక్ బ్లాక్, ల్యాబ్-1, ల్యాబ్-2, గర్ల్స్ హాస్టల్ వంటి కీలక నిర్మాణాలను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే సెమినార్ హాళ్లు, బాయ్స్ హాస్టల్ పనులను కూడా వేగవంతం చేసి, డిసెంబర్ నాటికి సమ్మిట్ నిర్వహణకు అంతా సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ కల్లా పనులన్నీ పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు మంత్రికి హామీ ఇచ్చారు.
మరోవైపు, వచ్చే విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైస్ ఛాన్సలర్ చెప్పారని అన్నారు. మొదటి విద్యా సంవత్సరంలోనే సుమారు 2,500 మంది విద్యార్థులను చేర్చుకోనున్నట్లు మంత్రి వివరించారు. ఈ స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను సరిగ్గా అమలు చేస్తే, దేశంలోనే నైపుణ్యం కలిగిన మానవ వనరుల విభాగంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు.