July 17, 2026

Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?

Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
Reading Time: 2 minutes
Off The Record About Avanigadda Politics Is Janasena Mla Mandali Buddha Prasad Upset Over Alliance Differences

Off The Record: కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి గెలిచిన జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్… స్థానికంగా కూటమిలో పెరుగుతున్న నిత్య అసమ్మతితో లోలోపల మధనపడుతున్నారట. టిడిపిలో గతంలో తనతో కలిసి పనిచేసిన కొందరు ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో చుక్కలు చూపిస్తున్నారన్నది ఎమ్మెల్యే ఫీలింగ్‌. దీంతో కొద్ది కాలంగా రాజకీయాల మీదే విరక్తిగా మాట్లాడుతున్నారాయన. ఇటీవల విజయవాడలో మాజీ సీఎం రోశయ్య విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యే… వేదిక మీదే చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి తప్పు చేశాను, ప్రస్తుతం రాజకీయాలు కలుషితం అయ్యాయంటూ ఆయన అన్న మాటలు సొంత పార్టీలో కూడా సెగలు పుట్టించాయి. అంత సీనియర్‌ లీడర్‌ ఎందుకు అలా అన్నారంటూ ప్రస్తుతం గట్టి చర్చలే నడుస్తున్నాయి. మండలి బుద్ధ ప్రసాద్ మొదట్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అవనిగడ్డ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వటంతో పసుపు కండువా కప్పుకొని అక్కడ నుంచే బరిలోకి దిగి విజయం సాధించారాయన. 2019లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో అవినిగడ్డ టిక్కెట్‌ను జనసేనకు కేటాయించాలని కూటమి పెద్దలు నిర్ణయం తీసుకోవడం బుద్ధప్రసాద్‌కు ఇబ్బంది అయిందని అంటారు. ప్రస్తుతం రాజకీయాలు చేయలేమని, టికెట్ కేటాయింపు, డబ్బు ప్రభావం వంటి అంశాలపై వరుస పోస్టులు పెట్టడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.

అదే సమయంలో అవనిగడ్డను టీడీపీ కోటాలోనే ఉంచి బుద్దప్రసాద్‌కు టిక్కెట్‌ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళనలు చేశారు. కానీ… అప్పటికే అవనిగడ్డ జనసేన కోటాకు ఫిక్స్ అయిపోవడంతో… అనూహ్యంగా చివరి నిమిషంలో మండలి జనసేనలోకి జంప్‌ అయి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. అయితే టిడిపిలో పనిచేసినప్పుడు ఆయనకు అండగా నిలిచిన టిడిపి కేడర్ ఇప్పుడు రివర్స్‌లో ఉందట. జనసేనలోకి వెళ్ళాక బుద్దప్రసాద్‌కు స్థానిక టిడిపి నాయకత్వం నుంచి సహకారం లేదన్నది లోకల్ టాక్. ఆయన తీరుపై ఇన్చార్జి మంత్రి సుభాష్‌కు అనేకమార్లు ఫిర్యాదులు చేశారు కూడా. ఇదే ఇప్పుడాయనకు చికాకు పుట్టిస్తోందని అంటున్నారు. ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన రోడ్డుకు మరోసారి టిడిపి నేతలు శంకుస్థాపన చేయటం, అన్న క్యాంటిన్‌లో శిలాఫలకంపై పేర్లు లేవని రచ్చ చేయటం, నియోజకవర్గ టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో నేరుగా ఫిర్యాదు చేయటం లాంటి వాటితో ఆయన నొచ్చుకున్నట్టు చెబుతున్నారు సన్నిహితులు. కొందరు నేతల తీరుపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని కూడా గతంలో హెచ్చరించారాయన. అయినా పరిస్థితి మారకపోవడంతో… నిర్వేదంతోనే తప్పు చేశానని అన్నట్టు తెలుస్తోంది.

దీంతోపాటు సొంత పార్టీలో కూడా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. అటు టిడిపి నేతలు మాత్రం పార్టీ నుంచి వెళ్ళిపోయాక తమ కీలక నేతలను జనసేనలోకి చేర్చుకుంటున్నారని, తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. తాము కూడా పనిచేస్తేనే ఆయన గెలిచారన్న విషయం మర్చిపోతే ఎలాగన్నది వాళ్ళ ప్రశ్న. ఇవే తన చివరి ఎన్నికలంటూ ఎన్నికల ముందే ప్రకటించిన బుద్ధ ప్రసాద్… ఇప్పుడు గెలిచాక కూడా… అనవసరంగా పోటీ చేశానంటూ చేసిన వ్యాఖ్యలతో ఈసారి ఇక పోటీ చేయకపోవచ్చని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.