July 16, 2026

2027 నుంచి కొత్త మైలేజ్ నిబంధనలు, ఈవీలు–హైబ్రిడ్ కార్లకు భారీ ప్రోత్సాహం!

2027 నుంచి కొత్త మైలేజ్ నిబంధనలు, ఈవీలు–హైబ్రిడ్ కార్లకు భారీ ప్రోత్సాహం!
Reading Time: 2 minutes

2027 నుంచి కొత్త మైలేజ్ నిబంధనలు, ఈవీలు–హైబ్రిడ్ కార్లకు భారీ ప్రోత్సాహం!

Caption of Image.

భారత్‌లో ఇంధన వాడకాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఎలక్ట్రిక్ వాహనాలు వాడటాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దిశగా విద్యుత్ మంత్రిత్వ శాఖ 2027 కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ(CAFE-III) నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తే కార్ల తయారీ కంపెనీలు మరింత ఇంధన సామర్థ్యం ఉన్న మైలేజీ ఎక్కువగా ఇచ్చే వెహికల్స్ మార్కెట్లోకి తీసుకురావాల్సి ఉంటుంది.

మైలేజ్‌పై కఠిన నిబంధనలు..
కొత్త రూల్స్ ప్రకారం 2027-28 నుంచి 2031-32 వరకు ప్రతి ఏడాది కార్ల సగటు ఇంధన వినియోగ ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తారు. అంటే ఆటో సంస్థలు విక్రయించే మొత్తం కార్ల సగటు మైలేజ్‌ను నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచాలి. లక్ష్యాలను అందుకోలేకపోతే ప్రత్యేక క్రెడిట్లను ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేయడం, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కంపెనీలకు పెద్ద భారమే.

ఈవీలు, హైబ్రిడ్ కార్లకు భారీ ప్రయోజనం..
ఈ ముసాయిదాలో అత్యంత కీలక మార్పు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు ఇచ్చిన ప్రోత్సాహం అని చెప్పుకోవాలి. బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం, రేంజ్ ఎక్స్‌టెండెడ్ ఈవీ ఒక్కోటి నిబంధనల లెక్కల్లో 3 వాహనాలుగా పరిగణిస్తారు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఫ్లెక్స్-ఫ్యూయల్ హైబ్రిడ్ కార్లకు 2.5 రెట్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లకు 1.6 రెట్లు ప్రయోజనం లభిస్తుంది. దీంతో ఈ తరహా వాహనాలను తయారు చేసే కంపెనీలకు నిబంధనలు పాటించడం మరింత ఈజీ అవుతుంది.

►ALSO READ | E20 పెట్రోల్‌ కల్తీకి ఇథనాలే కారణమా?.. పెట్రోల్ బంక్ ఓనర్స్ బయటపెట్టిన నిజం

ఈ20, సీఎన్‌జీ వాహనాలకు కూడా ఊరట..
మొదటిసారిగా ఈ20 ఇంధనం, సీఎన్‌జీ, బయోఫ్యూయల్స్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు కూడా కార్బన్ న్యూట్రాలిటీ ప్రయోజనాలను ప్రభుత్వం గుర్తించింది. ఈ20కు అనుకూలమైన కార్లకు కార్బన్ ఉద్గారాల లెక్కల్లో 8 శాతం తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది. ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు ఇది 22.3 శాతం వరకు ఉంటుంది. సీఎన్‌జీ వాహనాలకు కూడా 5 శాతం వరకు ప్రత్యేక ప్రయోజనం కల్పించనున్నారు.

కొత్త టెక్నాలజీలకు ప్రోత్సాహం..
ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, ఆరు లేదా అంతకంటే ఎక్కువ గేర్ల ట్రాన్స్‌మిషన్, ఎల్‌ఈడీ లైటింగ్, ఇంధనాన్ని ఆదా చేసే ఏసీ, సోలార్ రిఫ్లెక్టివ్ పెయింట్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించే కంపెనీలకు కూడా అదనపు ప్రయోజనాలు ఇవ్వనున్నారు.

వినియోగదారులపై ప్రభావం ఏంటి?
ఈ కొత్త రూల్స్ వల్ల రానున్న రోజుల్లో మరింత మైలేజ్ ఇచ్చే, తక్కువ కాలుష్యం విడుదల చేసే కార్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సీఎన్‌జీ, ఈ20 అనుకూల వాహనాల తయారీకి ఊతం లభిస్తుంది. చిన్న తయారీ సంస్థలకు మాత్రం సంవత్సరానికి వెయ్యి కంటే తక్కువ కార్లు విక్రయిస్తే ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. మొత్తంగా చూస్తే భారత ఆటోమొబైల్ రంగాన్ని పరిశుభ్రమైన, ఇంధన పొదుపు దిశగా తీసుకెళ్లేందుకు ఈ కొత్త CAFE-III నిబంధనలు కీలక మలుపుగా మారనున్నాయి.

©️ VIL Media Pvt Ltd.