Hyderabad: హైదరాబాద్ లూలూ మాల్‌లో గన్ కలకలం.. పోలీసులు అలర్ట్..

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ వద్ద ఉన్న లూలూ మాల్‌లో కలకలం రేగింది. ఓ వ్యక్తి తుపాకీతో హల్ చల్ చేశాడు. లూలూ మాల్ పార్కింగ్ స్థలంలో రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకోగా.. చివరికి ఇది కొట్లాటకు దారితీసింది. ఈ గొడవలో ఓ వ్యక్తి జేబులో తుపాకీ ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సంఘటన జూలై 12 ఆదివారం రాత్రి 9.30 నుండి 10 గంటల మధ్య లూలూ మాల్‌లోని B2 పార్కింగ్ స్థలంలో చోటుచేసుకోగా.. ఇప్పుడు వివరాలు ఆలస్యంగా బయటకొచ్చాయి. పార్కింగ్ స్థలంలో లూలూ మాల్ యాజమాన్యం కొన్ని గృహోపకరణాలను అమ్మకానికి పెట్టింది. ఆ వస్తువులను కొనేందుకు ప్రజలు క్యూలో భారీగా నిలబడ్డారు. క్యూలో ఎవరు ముందు ఉండాలనే విషయంలో చార్మినార్‌కు చెందిన మహ్మద్ జావేద్ (55)కి, కేరళకు చెందిన ఒక కుటుంబానికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో కేరళకు చెందిన కుటుంబ సభ్యులలో ఒకరిపై జావేద్ కుమారుడు మహ్మద్ షోఅబుద్దీన్ హైదర్ (18) దాడి చేశాడు. దీంతో గొడవ మరింతగా పెరిగింది.
అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ఈ క్రమంలో మాల్‌లోని నాలుగో అంతస్తులో షాపింగ్ చేస్తున్న జావేద్ మేనల్లుడు మహ్మద్ సిద్ధిఖీకి ఈ సంఘటన గురించి తెలిసింది. అతను వెంటనే పార్కింగ్ స్థలానికి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో సిద్ధిఖీ జేబులో తుపాకీ ఉండటాన్ని గమనించిన ఒక వ్యక్తి మాల్ యాజమాన్యానికి, KPHB పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిద్ధిక్ వద్ద 2029 వరకు చెల్లుబాటులో ఉన్న లైసెన్సు గల తుపాకీని గుర్తించారు. అతని వద్ద మొత్తం పన్నెండు రౌండ్ల తూటాలు కూడా లభ్యమయ్యాయి. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బహిరంగ ప్రదేశంలో ఇబ్బంది కలిగించినందుకు నోటీసులు జారీ చేసి వదిలేశారు. కేరళ కుటుంబం ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దీంతో తుపాకీని అతడికి తిరిగి ఇచ్చేశారు.
అయితే ఒక వ్యక్తి తుపాకీతో మాల్‌లోకి ఎలా ప్రవేశించాడనే విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది సరిగ్గా తనిఖీలు చేయకపోవడం వల్లనే ఇది సాధ్యమైందని అంటున్నారు. దీంతో లూలూ మాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే వ్యక్తి గన్‌తో ప్రవేశించకలిగాడనే నిర్దారణకు వచ్చారు.