July 16, 2026

Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!

Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
Reading Time: 2 minutes
Shabad Serial Killer Case New Twists Rajkumar Selfie Video Suicide Note Investigation

Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. 3 రోజుల తరువాత సూసైడ్ చేసుకున్నాడు. కానీ అక్కడితో ఈ కథ ముగియలేదు. అతని హిట్‌లిస్ట్‌లో ఇంకా చంపాల్సిన వారు ఉన్నారా? అంటే ఉన్నారనే తెలుస్తోంది. అందుకు అతడు తీసుకున్న సెల్ఫీ వీడియోనే సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు ఎలాంటి కేసులు పెట్టాలి? ఎవరిపై పెట్టాలనే విషయంపై ఆలోచిస్తున్నారు. దీంతో ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడకు చెందిన రాజ్‌కుమార్ సైకోలా మారి.. భార్య, ఇద్దరు కొడుకులతోపాటు.. తాను ప్రేమించినట్లు చెబుతున్న మైనర్ బాలికను, ఆమె తల్లి, నానమ్మను అత్యంత దారుణంగా నరికి చంపేశాడు. అర్ధరాత్రి పూట మారణహోమం సృష్టించాడు. ఐతే ఈ హత్యలకంటే ముందే రాజ్‌కుమార్ తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ సెల్ఫీ వీడియోలో అతను దాదాపు 13 నిమిషాలు మాట్లాడాడు. మైనర్ అమ్మాయి కుటుంబం తనను ఏ విధంగా వేధించింది? తన వద్ద ఎన్ని డబ్బులు తీసుకున్నారు? అనే విషయాలు వివరించాడు. అలాగే సెల్ఫీ వీడియోతోపాటు అతడు రాసిన 4 పేజీల సూసైడ్ లెటర్‌లో కూడా పలు కీలక అంశాలు ఉన్నాయి.

తన కుటుంబంతోపాటు మైనర్ బాలిక కుటుంబాన్ని కూడా చంపేస్తున్నానని తాను రాసుకున్న సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నాడు. తాను కేసులతో సతమతమయ్యేందుకు బాలిక కుటుంబంలోని మేనమామ రాజు, బాబాయ్ చిట్యాల శ్రీనివాస్, ఆయన సతీమణి, నరేష్ కూడా సహకరించారని చెప్పుకొచ్చాడు. ఐతే రాజ్‌కుమార్ వాళ్లను కూడా చంపేయాలని అనుకున్నాడా? అనే చర్చ జరుగుతోంది. ఘటన సమయంలో ఆ నలుగురు అక్కడ లేక పోవడం వల్లే బయటపడ్డారా? అని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. మరోవైపు పోలీసులు తమ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించి ఉంటే ఆరుగురి ప్రాణాలు పోయేవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మే 16న పోక్సో కేసు నమోదు చేసిన వెంటనే నిందితుడిని అరెస్టు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. కేసును పూర్తిగా నీరుగార్చుతూ నిందితునికి సులభంగా బెయిల్‌ వచ్చే సెక్షన్లు నమోదు చేసినందుకు ప్రతిఫలంగా రూ.25 లక్షల నగదు లంచంగా ఇచ్చేందుకు రాజ్‌కుమార్‌ డీల్‌ కుదుర్చుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫ్యూచర్‌ సిటీ సీపీ తరుణ్‌జోషి రహస్య విచారణ చేపట్టారని.. బెయిల్‌ డీల్‌ వెనుక ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు మర్డర్స్ తర్వాత.. రాజ్‌కుమార్ పోలీసులకు ఏ సీసీ కెమెరాలోనూ కనిపించలేదు. అటు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న అతనికి.. ఆ పురుగుల మందు ఎక్కడి నుంచి వచ్చింది? ముందే కొనుగోలు చేసి పెట్టుకున్నాడా? ఎక్కడ కొనుగోలు చేశాడనేది పోలీసులకు కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. పురుగుల మందు డబ్బా మీద బ్యాచ్ నెంబర్ ఉంటుంది. దాని ఆధారంగా పూర్తి విచారణ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు కొనుగోలుదారు వివరాలు తీసుకోకుండా ఎరువుల దుకాణాల యజమానులు పురుగుల మందు విక్రయించరు. కొనుగోలు చేసిన తర్వాత రసీదు కూడా ఇస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కొన్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.