అభివృద్ధిలో రాజకీయం వద్దు.. కేంద్రంతో చర్చలతోనే సమస్యల పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజల ప్రయోజనాల కోసమే తాను ఇన్నిసార్లు ఢిల్లీకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు, చర్చల ద్వారానే రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటున్నామని సీఎం తెలిపారు
ఢిల్లీ పర్యటనలో భాగంగా వరంగల్ మమూనూరు, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణను 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ క్రతువులో ప్రాంతీయ ఎయిర్ పోర్టుల అభివృద్ధి అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ : 2028 జూన్ 2 నాటికి.. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులు పూర్తి
ఈ క్రమంలోనే మమూనూరు ఎయిర్ పోర్టును 2028 జూన్ 2 నాటికి పూర్తి చేసేందుకు గడువు విధించారని చెప్పారు. ఇందుకోసం 253 ఎకరాల భూమిని సేకరించి ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగించామని, మరో 3, 4 రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. అలాగే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 1500 ఎకరాల భూమిని కేటాయించిందని, కేంద్రంతో కలిసి ఈ ప్రాజెక్టులను వేగంగా పరుగులు పెట్టిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.