Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు సవాల్..

Pakistan: పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు పాకిస్తాన్ వ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తిరుగుబాటుదారులు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇక పీఓకేలో ప్రజలు పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం ఫజల్ (జేయూఐ-ఎఫ్) అధిపతి మౌలానా ఫజలుర్ రెహమాన్, అసిమ్ మునీర్‌కు నేరుగా సవాల్ విసిరారు.
సైన్యం రాజకీయాల్లోకి రావాలనుకుంటే, యూనిఫాం విడిచిపెట్టి, సొంతగా ఒక పార్టీ ఏర్పాటు చేసుకుని, ఎన్నికల్లో పోటీ చేయాలని రెహమాన్ అన్నారు. బలూచిస్తాన్, పష్తూన్ ప్రాంతాల పరిస్థితిపై పాక్ ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశాన్ని రక్షించడమే సైన్యం పని అని, రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కాదని ఆయకన అన్నారు. దేశంలో ఎవరు అధికారాన్ని చేపట్టాలి, కోల్పోవాలి అని నిర్ణయించడం సైన్యం పని కాదని ఆయన అన్నారు.
ఉగ్రవాద నిరోధక చర్యల పేరుతో పౌరులకు ఆయుధాలు ఇవ్వాలని లేదా మిలీషియాలను ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్లు తప్పుదారి పట్టించేవని కూడా రెహమాన్ పేర్కొన్నారు. పౌరులకు ఆయుధాలు అందుబాటులోకి రావడం వల్ల మరింత రక్తపాతం మరియు వ్యక్తిగత వైరుధ్యాలు పెరిగే ప్రమాదం ఉన్నందున, తాను మాత్రం ఎలాంటి మిలీషియాను ఏర్పాటు చేయనని ఆయన స్పష్టంగా తెలిపారు. బలూచిస్తాన్ లోని చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణ లేదని ఫజ్లుర్ రెహమాన్ ఆరోపించారు. పష్తూన్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని, గత రెండు మూడు రోజుల్లో ఈ ప్రాంతాల నుంచి 50కి పైగా మృతదేహాలు వచ్చాయని అన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా లేరని, పిల్లలు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని, కూలీలు కూడా ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారని రెహమాన్ ఆరోపించారు.