కులాంతర ప్రేమ వ్యవహారం..మాదాపూర్ లో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారున హత్య జరిగింది. అయ్యప్ప సొసైటీలో ఉంటున్న చిన్నపల్లి భాస్కర్ అనే 30 ఏళ్ల యువకుడిపై దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా నరికి చంపారు. మృతుడు వరంగల్ జిల్లా మదన్నపేట్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.ఈ హత్య వెనుక పాత కక్షలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నిఖిత అనే యువతిని భాస్కర్ గతంలో ప్రేమించాడు. అయితే, అది కులాంతర ప్రేమ కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మూడేళ్ల క్రితం ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి జరిపించారు. కానీ, భర్తతో గొడవల కారణంగా ఆ యువతి విడాకులు తీసుకుంది. తన కూతురు కాపురం కూలిపోవడానికి, విడాకులకు భాస్కరే కారణమని అమ్మాయి తండ్రి రాజు కక్ష పెంచుకున్నాడు. గతంలో భాస్కర్‌ను చంపుతామని కూడా బెదిరించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే జులై 14న రాత్రి అయ్యప్ప సొసైటీలోని భాస్కర్ ఉంటున్న హాస్టల్ వద్దకు ఐదుగురు వ్యక్తులు వచ్చారు. కిందకు వచ్చిన భాస్కర్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడ్డారని భాస్కర్ సోదరుడు చిన్నపల్లి మధు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.