Reading Time: < 1 minute
Us Trump Appoints William J Pulte Acting Director National Intelligence

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నియామకాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఫెడరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏజెన్సీ (FHFA) డైరెక్టర్‌గా, అలాగే ఫ్యానీ మే-ఫ్రెడీ మాక్ సంస్థల చైర్మన్‌గా ఉన్న విలియమ్ జే. పుల్టేను తాత్కాలిక జాతీయ నిఘా డైరెక్టర్ (Acting Director of National Intelligence)గా నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేశారు. అమెరికాలో అత్యంత సున్నితమైన అంశాల నిర్వహణలో విలియమ్ పుల్టేకు విశేష అనుభవం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా మార్కెట్ల భద్రత, స్థిరత్వాన్ని కాపాడడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

అలాగే ఫ్యానీ మే, ఫ్రెడీ మాక్ సంస్థల ఆధ్వర్యంలో 10 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆస్తుల నిర్వహణను విజయవంతంగా చేపట్టారని… కేవలం ఏడాది క్రితం ఉన్న స్థాయితో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అని ట్రంప్ వివరించారు. తాత్కాలిక జాతీయ నిఘా డైరెక్టర్ బాధ్యతలు నిర్వహించే కాలంలో కూడా పుల్టే ఫెడరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏజెన్సీ డైరెక్టర్‌గా, ఫ్యానీ మే-ఫ్రెడీ మాక్ చైర్మన్‌గా కొనసాగుతారని ట్రంప్ స్పష్టం చేశారు. “డైరెక్టర్ పుల్టేకు అభినందనలు” అంటూ ట్రంప్ తన సందేశాన్ని ముగించారు. ఈ నియామకం అమెరికా పరిపాలనలో కీలక మార్పుగా భావిస్తున్నారు.

ఇటీవల అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్‌గా ఉన్న తులసి గబ్బార్డ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. పూర్తిగా కుటుంబ పరిస్థితుల వల్లే తాను తప్పుకోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. గబ్బార్డ్ భర్తకు అరుదైన రోగం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ క్లిష్ట సమయంలో భర్తకు అండగా నిలబడటమే తనకు అత్యంత ముఖ్యమని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.