Reading Time: < 1 minute
Ram Charan Eye Injury Peddi Shoot Buchi Babu Chiranjeevi Reaction

Buchi Babu Sana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ వైడ్‌గా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘పెద్ది’ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా షూటింగ్ లొకేషన్‌లో జరిగిన ఒక భయానక సంఘటన గురించి షాకింగ్ విషయాలను పంచుకున్నారు. షూటింగ్ టైంలో రామ్ చరణ్ కంటికి తీవ్ర గాయం కావడంతో తాను ఎంతగానో భయపడిపోయానని, ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఎలా స్పందించారో చెప్తూ బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు.

షూటింగ్ లొకేషన్‌లో జరిగిన ప్రమాదం గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ.. “సినిమాలోని ఒక కీలకమైన సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ గారి కంటికి ఊహించని విధంగా గాయమైంది. ఆ దెబ్బకు ఆయన కంటి నుంచి రక్తం కారిపోయింది. అదంతా లైవ్‌లో కెమెరాలోనే రికార్డ్ అయింది. చరణ్ గారు రక్తంతో తడిచిపోవడం చూసి నాకు ఒక్కసారిగా చేతులు, కాళ్లు ఆడలేదు.. విపరీతమైన భయం వేసింది” అంటూ లొకేషన్ లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.

ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే ఒక గ్లోబల్ స్టార్‌కు తన సెట్స్‌లో గాయం కావడంతో బుచ్చిబాబు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. “చరణ్ గారికి దెబ్బ తగిలిందని తెలియగానే.. ఇంటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఆ క్షణంలో నాకు గుండె ఆగినంత పనైంది. సరిగ్గా చూసుకోలేదని చిరంజీవి గారు ఫోన్ చేసి నన్ను గట్టిగా తిడతారేమో అని భయపడ్డాను” అని బుచ్చిబాబు వెల్లడించారు. అయితే ఫోన్ ఎత్తిన బుచ్చిబాబుకు మెగాస్టార్ చిరంజీవి ఊహించని షాక్ ఇచ్చారు. ఆయన బుచ్చిబాబును తిట్టకపోగా.. ఎంతో కూల్‌గా మాట్లాడారట. “ఆయన ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కంగారు పడకు బుచ్చి.. ఆ గాయం అయిన వీడియో క్లిప్ ఒకసారి నాకు పంపించు అని అడిగారు” అంటూ చిరంజీవి గారు చూపించిన మెచ్యూరిటీ, సపోర్ట్‌ను చూసి తాను ఆశ్చర్యపోయానని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.