Reading Time: < 1 minute
Chittoor Illegal Fetal Gender Determination Racket Busted

Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో రహస్యంగా సాగుతున్న అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల (Fetal Gender Determination) రాకెట్ గుట్టురట్టయింది. బంగారుపాళ్యం కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందాను తమిళనాడు వైద్యాధికారులు, చిత్తూరు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌తో బట్టబయలు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అందులోనే ఏకంగా స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి ఈ అక్రమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని నిర్వాహకులు అద్దెకు తీసుకున్నారు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఆ ఇంట్లోనే ఏకంగా ఒక స్కానింగ్ మిషన్‌ను కొనుగోలు చేసి అమర్చారు. కేవలం స్థానికులే కాకుండా, సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా భారీగా గర్భిణీలు లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక్కడికి వస్తున్నట్లు విచారణలో తేలింది. ఏజెంట్ల సహాయంతో గత కొంతకాలంగా ఈ నెట్‌వర్క్ అత్యంత రహస్యంగా సాగుతోంది.

విశ్వసనీయ సమాచారంతో పోలీసులు, తమిళనాడు వైద్యాధికారులు ఒక్కసారిగా ఆ కేంద్రంపై దాడి చేశారు. పోలీసులు లోపలికి వెళ్లే సమయానికి సెంటర్లోనే ఏకంగా 15 మంది గర్భిణీలు పరీక్షల కోసం వేచి చూస్తూ కనిపించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కడుపులో ఉన్న బిడ్డ ఆడ , మగ అని చెప్పడానికి ఒక్కో గర్భిణి నుంచి నిర్వాహకులు పది వేల రూపాయల (€10,000) వరకు వసూలు చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ దాడిలో అక్రమంగా పరీక్షలు నిర్వహిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఉన్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన నిందితులపై తీవ్రమైన ‘లింగ నిర్ధారణ నిరోధక చట్టం’ (PCPNDT Act) కింద కేసులు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న స్కానింగ్ యంత్రాన్ని, ఇతర సాగ్రిగీలను అధికారులు స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.