Reading Time: 2 minutes
Passive Smoking And Fertility How Occasional Smoking Can Affect Pregnancy And Reproductive Health

Passive Smoking : సిగరెట్ తాగేవారికే కాదు, పక్కన నిలబడి పొగను పీల్చేవారికీ ప్రమాదమేనని వైద్యులు ఎన్నో ఏళ్లుగా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ చాలామంది యువతలో ఒక అపోహ బలంగా ఉంది. పార్టీల్లో, స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు మాత్రమే పొగ తాగితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదని భావిస్తున్నారు. అయితే సంతానోత్పత్తి సామర్థ్యం విషయంలో ఈ నిర్లక్ష్యం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించే పరిస్థితిని తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.

ముంబైలోని అంధేరిలో ఉన్న నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కేంద్రానికి చెందిన ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రజక్తా చౌదరి ప్రకారం, అప్పుడప్పుడు సిగరెట్ తాగడం కూడా సంతానోత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్టీలు, సెలవులు, వీకెండ్ పార్టీలలో మాత్రమే పొగ తాగే వారు తమను తాము అసలు ధూమపానులుగా పరిగణించరు. అయితే సిగరెట్‌లో ఉండే నికోటిన్‌తో పాటు ఇతర హానికర రసాయనాలు, శరీరంలోకి పదేపదే చేరడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక మహిళల్లో ఈ ప్రభావం మరింత ఆందోళన కలిగించేలా ఉండవచ్చు. సిగరెట్‌లోని విషపూరిత పదార్థాలు అండాశయాల పనితీరును ప్రభావితం చేసి అండాల నాణ్యతను కూడా తగ్గించగలవు. అంతేకాదు వయస్సుతో తగ్గే అండాల నిల్వను మరింత వేగంగా క్షీణింపజేసే అవకాశం కూడా ఉంది. హార్మోన్ స్థాయిల్లో మార్పులు రావడం వల్ల నెలసరి చక్రం అసమతుల్యంగా మారి, కాలక్రమేణా గర్భం దాల్చే అవకాశాలు తగ్గిపోవచ్చు.

అప్పుడప్పుడు మాత్రమే పొగ తాగే మహిళల్లో కూడా గర్భస్రావం, గర్భాశయం వెలుపల గర్భం ఏర్పడే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి సమస్యల ముప్పు ఎక్కువగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే ముందస్తు ప్రసవం, తక్కువ బరువుతో శిశువు జననం, మృత శిశువు జననం, పుట్టిన తర్వాత శిశువుకు శ్వాస సంబంధిత వంటి ప్రమాదకర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పురుషుల్లో కూడా ధూమపానం వల్ల వీర్యకణాల సంఖ్య, వాటి కదలిక సామర్థ్యం దెబ్బతినవచ్చు. శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం వల్ల వీర్యకణాల డీఎన్ఏ దెబ్బతిని సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు. ఈ సమస్యలు ఒక్కసారిగా బయటపడకపోవడం వల్ల చాలా మంది పురుషులు ప్రమాదాన్ని గుర్తించలేకపోతారు.

ఇక్కడ మరో ముఖ్యమైన అంశం పాసివ్ స్మోకింగ్. అంటే తాము సిగరెట్ తాగకపోయినా, తరచుగా ఇతరుల పొగకు గురయ్యే వారు కూడా ప్రమాదం నుంచి తప్పించుకోలేరు. ముఖ్యంగా గర్భధారణ కోసం ప్రణాళికలు వేసుకుంటున్న దంపతులు, ఐవీఎఫ్ వంటి ఫెర్టిలిటీ చికిత్సలు తీసుకుంటున్న వాళ్ళు ఈ విషయాన్ని మరింత సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది.

ధూమపానం చాలాసార్లు మద్యం సేవించడం, రాత్రిళ్లు ఆలస్యంగా మేల్కొని ఉండటం, అధిక ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లతో కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ కలిసి హార్మోన్ల సమతుల్యతను మరింత దెబ్బతీసి సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు.

అందుకే రోజూ పొగ తాగేవారికే కాదు, అప్పుడప్పుడు సరదాగా సిగరెట్ వెలిగించే వారికీ ఈ హెచ్చరిక వర్తిస్తుంది. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవాలంటే ధూమపానాన్ని పూర్తిగా మానేయడమే ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు తీసుకునే చిన్న నిర్ణయం, రేపటి ఆరోగ్యకరమైన గర్భధారణకు, ఆరోగ్యవంతమైన కుటుంబ భవిష్యత్తుకు పునాది కావచ్చు.