Reading Time: < 1 minute
Kris Srikkanth Warns Rcb Drop Romario Shepherd Ipl 2026 Final

ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడుతున్న నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్‌సీబీ యాజమాన్యానికి ఆయన ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్‌ను ఫైనల్ మ్యాచ్ తుది జట్టులోకి తీసుకోకూడదని ఆయన కోరారు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన శ్రీకాంత్.. “ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోవడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది. అదే షెపర్డ్‌తో మూడు ఓవర్లు బౌలింగ్ చేయించడం. ఒకవేళ అతడు గనుక మూడు ఓవర్లు వేస్తే, ఆర్‌సీబీ చేతుల్లోంచి మ్యాచ్ చేజారిపోతుంది. ఈ సీజన్‌లో అతడు 7 వికెట్లు తీసినప్పటికీ, 12 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. అందుకే అతడిని అస్సలు ఆడించకూడదు” అని విశ్లేషించారు. అలాగే ఫిలిప్ సాల్ట్ జట్టులోకి అందుబాటులోకి వచ్చినప్పటికీ, మంచి ఫామ్‌లో ఉన్న వెంకటేష్ అయ్యర్‌నే కొనసాగించాలని సూచించారు.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ విజయావకాశాలపై కూడా శ్రీకాంత్ మాట్లాడారు. జీటీ గెలవాలంటే ఆర్‌సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, పడిక్కల్‌ల భాగస్వామ్యాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడదీయాలని చెప్పారు. కోహ్లీ కేవలం 40 పరుగులు చేసినా ఆర్‌సీబీ గెలిచేస్తుందని, కాబట్టి కోహ్లీ, పడిక్కల్, రజత్ పటిదార్‌లలో కనీసం ఇద్దరిని పవర్‌ప్లేలోనే అవుట్ చేస్తేనే గుజరాత్‌కు గెలిచే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకోసం జీటీ బౌలర్లు కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ కలిసికట్టుగా రాణించాల్సి ఉంటుందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.