Reading Time: < 1 minute
Mamata Banerjee Allegedly Scolds Belle Vue Hospital Ceo Over Abhishek Banerjee Treatment

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. నిన్న సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ నెంబర్ 2, మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో బాధిత తృణమూల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో స్థానికులు దాడికి దిగారు. తనపై బీజేపీ కక్షసాధింపు పాల్పడుతోందని అభిషేక్ ఆరోపించారు. పాలకులు హంతకుల్లా మారారని మమతా బెనర్జీ ఆరోపించింది.

ఇదిలా ఉంటే, తాజాగా మమతా బెనర్జీ కోల్‌కతాలోని బెల్లే వ్యూ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌పై అరుస్తున్న వీడియోను బీజేపీ బయటపెట్టింది. సీఈఓ ప్రదీప్ టాండన్‌ను దీదీ హెచ్చరిస్తూ మాట్లాడింది. ‘‘క్షమించండి మిస్టర్ టాండన్, మీరు తప్పు చేశారు. మేము మీ కోసం ఇంకేం చేశామో దయచేసి గుర్తుంచుకోండి. దేవుడు మిమ్మల్ని క్షమించడు. మీరు పొరపాటు చేశారు. దానికి మీరు సిగ్గుపడాలి. మీ అహంకారాన్ని అందరూ గుర్తుంచుకుంటారు, బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే మీరు ఆసుపత్రిని నడుపుతూ వైద్యులను బెదిరిస్తున్నారు. రేపు కేంద్ర ప్రభుత్వం లేకపోతే, మేమే చూసుకుంటాం’’ అని అరుస్తున్న వీడియో బయటకు వచ్చింది.

ఈ వీడియోను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేబ్‌జిత్ సర్కార్ షేర్ చేస్తూ.. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఎలాంటి చెప్పుకోదగ్గ గాయాలు కానప్పటికీ అతడిని ఆస్పత్రిలో చేర్చుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని మమతపై ఆరోపణలు గుప్పతించారు. సీఐడీ సమన్ల నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా అభిషేక్ బెనర్జీపై ఆరోపణలు చేశారు.

దాడి తర్వాత ఛాతిపై కమిలిన గాయాలు మినహా, తీవ్రమైన శారీరక గాయాలు లేవని, రోగి మాట్లాడుతున్నారని, పూర్తిగా స్పృహలో ఉన్నారని ఆస్పత్రి ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే, తన మేనల్లుడిని ఆస్పత్రిలో చేర్చుకోవద్దని బీజేపీ ఒత్తిడి తెస్తుందని మమతా ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ దాడికి పాల్పడిన వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.