Reading Time: 2 minutes
Rcb Probable Playing Xi Vs Gujarat Titans Ipl 2026 Final

RCB Playing XI: ఐపీఎల్ 2026 లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరగబోయే ఈ గ్రాండ్ ఫైనల్‌ మహాసమరంలో ఆర్‌సీబీ జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో రజత్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్‌సీబీ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉండటమే కాకుండా, ఆటగాళ్లందరి సమిష్టి ప్రదర్శనతో అదరగొడుతోంది. అయితే, ఈ తుది పోరుకు ముందు ఆర్‌సీబీ ప్లేయింగ్-11పై సర్వత్రా ఆసక్తికర చర్చ నడుస్తోంది. జట్టులో మార్పులు ఉండవచ్చని కొందరు అభిమానులు భావిస్తున్నప్పటికీ, రెండో ట్రోఫీని గెలవడమే పరమావధిగా బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ.. తమ విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చే రిస్క్ చేయకపోవచ్చు.

గాయం కారణంగా ఇంగ్లాండ్ వెళ్లిన స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్.. కొన్ని వారాల క్రితమే జట్టుతో చేరినప్పటికీ పూర్తిగా కోలుకోకపోవడంతో ఫైనల్ మ్యాచ్‌లోనూ వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో 5 ఇన్నింగ్స్‌లలో 59 సగటుతో 177 పరుగులు చేసిన వెంకటేష్ అయ్యర్, గత రెండు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా 19 బంతుల్లో 44, అలాగే 7 బంతుల్లో 19 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జాకబ్ బెథెల్‌ను సైతం వెనక్కి నెట్టాడు. మరోవైపు 15 మ్యాచ్‌ల్లో 600 పరుగులతో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, అయ్యర్‌తో కలిసి జట్టుకు బలమైన పునాది వేయగలడు. ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్, నాలుగో స్థానంలో కెప్టెన్ రజత్ పాటిదార్, ఐదో స్థానంలో కృణాల్ పాండ్యా బ్యాటింగ్‌ను బలోపేతం చేస్తుండగా, ఫినిషర్ బాధ్యతలను టిమ్ డేవిడ్ మోయనున్నాడు. అయితే ఈ సీజన్ లో ఆశించిన స్థాయిలో రాణించని వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ ప్రదర్శనపై అందరి కళ్లూ ఉన్నాయి.

ఇక అహ్మదాబాద్ పిచ్ ఈ సీజన్‌లో పేసర్లకు బాగా అనుకూలించడంతో ఆర్‌సీబీ నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ పేస్ విభాగానికి సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నాయకత్వం వహించనుండగా.. క్వాలిఫయర్-1 లో గుజరాత్‌పై 3 వికెట్లు తీసిన జాకబ్ డఫీ ప్లేయింగ్-11లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. వీరితో పాటు జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ డార్ పేస్ బాధ్యతలను పంచుకుంటారు. ఒకవేళ ఫైనల్ గనుక నల్లమట్టి పిచ్‌పై జరిగితే, కెప్టెన్ పాటిదార్.. రోమారియో షెపర్డ్‌ను జట్టులోకి తీసుకునే సాహసం చేయవచ్చు, దీనివల్ల బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ డెప్త్ సైతం పెరుగుతుంది. ఈ పిచ్‌పై స్పిన్నర్లకు పెద్దగా రికార్డు లేకపోవడంతో ప్రధాన స్పిన్నర్‌గా కృణాల్ పాండ్యా మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. అవసరమైతే సుయాష్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చు.