Reading Time: < 1 minute
Benjamin Netanyahu Praises India Support For Israel

Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ భారత్‌పై మరోసారి తన అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నారు. భారత్ గురించి గొప్పగా చెప్పారు. భారత్-ఇజ్రాయిల్ మధ్య బంధం చాలా గాఢమైందని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం వెస్ట్ బ్యాంక్‌లో జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారత్ అనే భారీ శక్తితో ఇజ్రాయిల్‌కు ఉన్న ప్రత్యేక సంబంధంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలో చాలా దేశాలతో మాకు సమస్యలు ఉన్నాయి, కానీ భారత్‌తో లేవు అని అన్నారు. భారత్‌లో ఇజ్రాయిల్‌కు చాలా క్రేజ్ ఉందని, విపరీతమైన మద్దతు ఉందని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ నుంచి ఇజ్రాయిల్‌కు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారని ఆయన అన్నారు.

భారత్ గురించి నెతన్యాహూ గొప్పగా చెప్పడం ఇదే తొలిసారి కాదు. 2018లో ఆయన తన భార్య సారాతో కలిసి న్యూఢిల్లీ వచ్చినప్పుడు, ఆ పర్యటనను ‘‘లవ్ ఫెస్టివల్’’గా అభివర్ణించారు. భారతీయులకు ఇజ్రాయిల్ పట్ల అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. తాజాగా జరిగిన సమావేశంలో నెతన్యాహూ మాట్లాడుతూ, భారత్‌లో 140 కోట్ల జనాభా ఉందని, అక్కడ ఇజ్రాయిల్‌కు చాలా ఆదరణ ఉందని చెప్పారు. ప్రధాని మోడీ ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని స్వాగించారని ఆయన సీబీఎస్ న్యూస్ ‘‘60 మినట్స్’’ కార్యక్రమంలో అన్నారు.

ఇటీవల కాలంలో అమెరికన్లలో ఇజ్రాయిల్ పట్ల ఆదరణ తగ్గుతోందనే నివేదికల నేపథ్యంలో నెతన్యాహూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఏప్రిల్‌లో డుదలైన తాజా ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం, అమెరికాలోని 60% మంది వయోజనులు ఇజ్రాయెల్ పట్ల ప్రతికూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్లు తేలింది. గత ఏడాది ఇది 53 శాతంగా ఉండేది. తన పేరును తగ్గించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని నిందించారు. అమెరికా ప్రజల అభిప్రాయంలో ఇజ్రాయిల్ వ్యతిరేకతను పెంచడానికి పాకిస్తాన్ సోషల్ మీడియా బాట్ ఫార్మ్‌లను ఉపయోగిస్తుందని ఆరోపించారు. అమెరికా-ఇజ్రాయిల్ కూటమిని బలహీనపరచడానికి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.