Reading Time: 2 minutes
Delhi Government Advises Ac Temperature Between 24c And 26c To Cut Power Bills

AC Temperature Guidelines: దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉండటంతో ఎయిర్ కండిషనర్ల (ఏసీలు) వినియోగం భారీగా పెరిగింది. అయితే చాలామంది తమ ఇళ్లలో, కార్యాలయాల్లో ఏసీని 18 డిగ్రీల సెల్సియస్ వద్ద నడుపుతుంటారు. దీనివల్ల విద్యుత్ వినియోగం అధికమై భారీ బిల్లులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ పొదుపు కోసం ఢిల్లీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఏసీలను 24 డిగ్రీల సెల్సియస్ నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య సెట్ చేసి వినియోగించాలని సూచించింది. ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు.

నిపుణుల అంచనాల ప్రకారం, ఏసీ ఉష్ణోగ్రతను ప్రతి ఒక డిగ్రీ పెంచితే సుమారు 5 నుంచి 6 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది. ఈ లెక్కన 18 డిగ్రీల వద్ద నడిపే ఏసీని 24 డిగ్రీలకు పెంచితే 30 నుంచి 36 శాతం వరకు విద్యుత్ పొదుపు చేయవచ్చు. అదే 26 డిగ్రీల వద్ద నడిపితే 40 నుంచి 48 శాతం వరకు విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఒక ఏసీని 18 డిగ్రీల సెల్సియస్ వద్ద 8 గంటల పాటు నడిపితే 8 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుందని భావిస్తే, అదే ఏసీని 24 డిగ్రీల వద్ద నడిపితే విద్యుత్ వినియోగం 5.1 నుంచి 5.6 యూనిట్లకు తగ్గవచ్చు. ఇక 26 డిగ్రీల వద్ద నడిపితే 4.2 నుంచి 4.8 యూనిట్ల మధ్య మాత్రమే ఖర్చయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంధన, విద్యుత్ పొదుపు పిలుపు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ఇతర విభాగాలు విద్యుత్ వినియోగాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే పగటిపూట అనవసరంగా లైట్లు వెలిగించకుండా సహజ కాంతిని ఎక్కువగా ఉపయోగించుకోవాలని సూచించింది. గదులు, కారిడార్లు, కార్యాలయాల్లో అధిక కాంతి వాడకాన్ని తగ్గించాలని పేర్కొంది. అవసరం లేని సమయంలో లైట్లు, విద్యుత్ ఉపకరణాలు ఆపివేయడానికి మాస్టర్ స్విచ్‌లను ఏర్పాటు చేసుకోవాలని కూడా ప్రజలకు సూచించారు. ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా విద్యుత్ బిల్లులు తగ్గడమే కాకుండా దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగ భారం కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.