Reading Time: 2 minutes
Supreme Court Orders Nationwide Implementation Of Single Emergency Helpline 112

Supreme Court: ఒక్కో రాష్ట్రంలో.. ఒక్కో అత్యవసర సేవకు ఒక్కో ఎమర్జెన్సీ నంబర్‌ ఉన్నాయి.. దీంతో, బాధితులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది.. అయితే, దేశవ్యాప్తంగా అత్యవసర సేవల కోసం ఒకే హెల్ప్‌లైన్ నంబర్ ‘112’ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో పోలీసులకు 100, అగ్నిమాపక సేవలకు 101, అంబులెన్స్ సేవలకు 102 మరియు 108, హైవే అత్యవసర సేవలకు 1033, మహిళల భద్రత కోసం 1091 వంటి వేర్వేరు నంబర్లు ఉపయోగిస్తున్నారు. అయితే ప్రమాదాలు లేదా వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఈ వేర్వేరు నంబర్లు ప్రజల్లో గందరగోళానికి దారితీస్తున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

రోడ్డు భద్రత సంస్థ ‘సేవ్‌లైఫ్ ఫౌండేషన్’ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చంద్రకర్‌ల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ట్రామా కేర్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ఉన్న జీవించే హక్కుతో నేరుగా సంబంధం కలిగి ఉందని కోర్టు స్పష్టం చేసింది. ప్రమాదాలు లేదా తీవ్ర గాయాల సమయంలో బాధితులు షాక్‌లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అటువంటి సమయంలో ప్రతి క్షణం ఎంతో కీలకమని ధర్మాసనం పేర్కొంది. అత్యవసర సహాయం అందడంలో జాప్యం జరిగితే ప్రాణాలను కాపాడే అవకాశాలు తగ్గిపోతాయని, వేగవంతమైన స్పందన ప్రాణరక్షక ఔషధంలా పనిచేస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో మూడు నెలల్లోగా ‘112’ హెల్ప్‌లైన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కోర్టు ఆదేశించింది. అలాగే అమలు పురోగతిపై రెగ్యులర్ కంప్లయన్స్ రిపోర్టులు సమర్పించాలని, ప్రతి నెల సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించింది. సమావేశాల రికార్డులు, పురోగతి వివరాలను అధికారిక పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. మరోవైపు దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ అంబులెన్సులను AIS-125 జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయాలని కోర్టు పేర్కొంది. ప్రతి అంబులెన్స్‌లో GPS, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌లు ఏర్పాటు చేసి వాటిని నేరుగా ‘112’ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించింది. దీని ద్వారా అత్యవసర సేవల స్పందన వేగం పెరిగి, బాధితులకు తక్షణ సహాయం అందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ట్రామా కేసుల కోసం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన మెడికల్ రెస్క్యూ ప్రోటోకాల్‌ను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి మూడు నెలల గడువు ఇచ్చింది. అనంతరం రాష్ట్రాలకు అమలుకు అదనపు సమయం ఇవ్వనుంది. అలాగే ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చే వ్యక్తులు పోలీసు విచారణలు, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో వెనుకంజ వేస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ అమలుతో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సహాయం అందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.