Reading Time: 2 minutes
Glenn Phillips Fires Back At Reporter After Gts Heavy Loss To Rcb In Ipl 2026

Glenn Phillips Slams Reporter after IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్ టైటాన్స్‌ (జీటీ) ఘోర పరాజయం చవిచూసిన తర్వాత జట్టులో తీవ్ర నిరాశ నెలకొంది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో జీటీ 162 పరుగులకే ఆలౌట్ అయింది. 92 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన గుజరాత్ నేరుగా ఫైనల్ చేరే అవకాశాన్ని కోల్పోయింది. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జీటీ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ పాల్గొన్నాడు. అయితే ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై ఫిలిప్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేసిన తర్వాతే జీటీ మానసికంగా ఓటమిని అంగీకరించిందా?’ అని గ్లెన్ ఫిలిప్స్‌ను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. జర్నలిస్ట్ ప్రశ్నతో ఫిలిప్స్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే స్పందిస్తూ.. ‘అది చాలా సిల్లీ క్వశన్. నిజంగా చాలా చెత్త ప్రశ్న. ప్రొఫెషనల్ క్రికెటర్లు మైదానంలోకి ఓడిపోవడానికి వెళ్లరు. మేమెందుకు మ్యాచ్ వదిలేస్తాం?. 250 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయాలంటే ప్రతి విషయం సరిగ్గా జరగాలి. మేము చాలా ప్రయత్నించాం. కానీ అది సాధ్యపడలేదు’ అంటూ గట్టిగా బదులిచ్చాడు.

గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ త్వరగా కుప్పకూలడం గురించి ఫిలిప్స్ స్పందించాడు. ‘250 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే సమయంలో ప్రెజర్ ఉంటుంది. చాలా తక్కువ జట్లు మాత్రమే పెద్ద లక్ష్యాలను ఛేదించగలిగాయి. పంజాబ్ కింగ్స్ కొన్ని సార్లు ఛేజ్ చేసి చూపించింది. టార్గెట్ అవతలి వారికి ఈజీగా కనిపించొచ్చు కానీ.. నిజానికి అలాంటి బిగ్ టార్గెట్ ఛేజ్ చేయడం చాలా కష్టం. నేను ఇప్పటివరకు 250 పరుగులకు దగ్గరగా ఉన్న ఛేజ్‌లో కూడా భాగం కాలేదు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనకు అనుకూలించవు’ అని గ్లెన్ ఫిలిప్స్‌ చెప్పుకొచ్చాడు.

‘ఈ మ్యాచ్‌లో ఆడకపోయినా మీడియా సమావేశానికి రావడం వింతగా అనిపించలేదా?’ అని మరో రిపోర్టర్ ప్రశ్నించగా.. ఫిలిప్స్ చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ‘అందులో వింతేమీ లేదు. మేమంతా జట్టులో భాగమే. ప్రతి ఒక్కరికీ మీడియా బాధ్యతలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎలిమినేటర్ ఆడాల్సిన ప్లేయర్లకు కాస్త విశ్రాంతి అవసరం. వారు తదుపరి మ్యాచ్‌కు మానసికంగా సిద్ధం కావాలి. మా కోచ్ ఆశిష్ నెహ్రా ఎప్పుడూ చెప్పినట్లే.. చిల్ పిల్ తీసుకుని తదుపరి మ్యాచ్‌పై ఫోకస్ పెట్టాలి’ అని తెలిపాడు. క్వాలిఫయర్-1లో ఓడిపోయినప్పటికీ గుజరాత్ టైటాన్స్‌కు ఇంకా ఫైనల్ చేరే అవకాశం ఉంది. క్వాలిఫయర్-2లో గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖాయం అవుతుంది. అయితే ఆర్సీబీ చేతిలో ఎదురైన భారీ ఓటమి నుంచి త్వరగా కోలుకుని మళ్లీ బలంగా తిరిగి రావడమే జీటీ ముందున్న అసలైన సవాల్.