Reading Time: 2 minutes
Virat Kohli Gets Emotional After Rcb Reach Ipl 2026 Final Says We Play For Our Fans

Virat Kohli Emotional Comments on RCB Fans: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ (జీటీ)పై ఘన విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముందుగా ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో గుజరాత్‌ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. 92 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ.. రెండో ఐపీఎల్ టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఈ ఘన విజయానంతరం ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అభిమానులను కదిలిస్తున్నాయి. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన అనుభూతిని గుర్తు చేసుకున్న కింగ్.. బెంగళూరు నగరం తన హృదయానికి ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. బెంగళూరు కోసం ప్రాణం పెట్టి ఆడుతున్నాం అని తెలిపాడు.

‘2025లో 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచాం. ఆ సమయంలో నా జీవితంలోని ప్రతి భావోద్వేగాన్ని అనుభవించా. నా హృదయం, ఆత్మ ఎప్పుడూ బెంగళూరు కోసమే. ఇప్పుడు మరోసారి ఫైనల్‌కు అర్హత సాధించడం నిజంగా అద్భుతంగా అనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాలు మేము నిరాశ, హార్ట్‌బ్రేక్‌ను ఎదుర్కొన్నాం. కానీ ఈ జట్టు ఇప్పుడు అద్భుతాలు చేస్తోంది. అసలు సిసలైన ఆర్సీబీ టీమ్ ఇది. టైటిల్ గెలుస్తామనే ఎంతో నమ్మకం ఉంది’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

ఆర్సీబీ ఇప్పుడు కేవలం టైటిల్‌ను కాపాడుకోవడానికే ఆడటం లేదని, కష్ట కాలంలో జట్టుకు అండగా నిలిచిన కోట్లాది అభిమానుల కోసం పోరాడుతోందని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ‘మేము కేవలం ఛాంపియన్ కిరీటాన్ని కాపాడుకోవడాని మాత్రమే ఆడటం లేదు. మేము ఎన్నో సీజన్లుగా నిరాశపర్చినా అభిమానులు మా వెంటే ఉన్నారు. మాకు అండగా నిలిచిన అభిమానుల కోసం ఆడుతున్నాం. ఇంకో ఒక్క అడుగు మాత్రమే మిగిలింది. ఆ ట్రోఫీ కోసం మా శక్తి మొత్తం పెట్టి పోరాడతాం’ అంటూ కింగ్ ఎమోషనల్ అయ్యాడు. విరాట్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత నమ్మకమైన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. 2008 నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ తరఫునే ఆడుతున్న కింగ్.. ఎన్నో నిరాశలు, విమర్శలు ఎదుర్కొన్నాడు. వేల కొద్ది రన్స్ చేసినా 18 ఏళ్ల పాటు టైటిల్ లేదంటూ కోహ్లీని అందరూ విమర్శించారు. అయితే 2025లో తొలి టైటిల్ గెలిచి ఆ విమర్శలకు పులిస్టాప్ పెట్టాడు. ఇప్పుడు వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ.. మరోసారి ట్రోఫీని అందుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ సీజన్‌లో కూడా కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో 15 ఇన్నింగ్స్‌లలో 600 పరుగులు సాధించాడు. కీలక మ్యాచ్‌ల్లో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. రజత్ పాటీదార్ నాయకత్వం, బౌలింగ్ యూనిట్ సమిష్టి ప్రదర్శన, కోహ్లీ అనుభవం కలిసి ఆర్సీబీని మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా నిలబెట్టాయి. ఇప్పుడు అభిమానులందరి దృష్టి ఫైనల్‌పైనే ఉంది. ‘ఈసాలా కప్ నమ్‌దే’ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.