
Tea and Biscuits: ఉదయం లేవగానే ఒక కప్పు టీతో పాటు బిస్కెట్లు తినడం చాలా మందికి అలవాటు. ఖాళీ కడుపుతో టీ తాగితే అసౌకర్యంగా ఉంటుందని భావించి, చాలామంది టీతో పాటు బిస్కెట్లు తీసుకుంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ముఖ్యంగా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందా? అనే ప్రశ్నకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఎండోక్రినాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రాజేష్ ఖడ్గవత్ వివరణ ఇచ్చారు. చాలా బిస్కెట్లలో లాక్టోస్, గ్లూకోజ్, శుద్ధి చేసిన పిండి మరియు అదనపు చక్కెరలు ఉంటాయి. కొన్ని ఫ్లేవర్డ్ బిస్కెట్లలో దాగి ఉన్న చక్కెరలు, కృత్రిమ స్వీటెనర్లు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో కేలరీలను పెంచి, కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తాయి. అదే సమయంలో తీపి కలిపిన టీ కూడా రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
బిస్కెట్లు తినడం వల్ల కళ్లకు కూడా హాని..!
ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా వ్యాయామం చేయని వ్యక్తుల్లో ఈ అలవాటు మధుమేహం వచ్చే అవకాశాలను పెంచవచ్చు. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారు అప్పుడప్పుడు టీ, బిస్కెట్లు తీసుకుంటే ప్రమాదం తక్కువగా ఉండొచ్చని చెప్పారు. కానీ ఊబకాయం, అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నవారు ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. బిస్కెట్ల అధిక వినియోగం కంటి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పబ్‌మెడ్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, బిస్కెట్ల వినియోగం మరియు డయాబెటిక్ రెటినోపతి ప్రమాదం మధ్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువ బిస్కెట్లు తినే మధుమేహ రోగుల్లో కంటి సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
షుగర్ లేని బిస్కెట్లు తినవచ్చా?
చాలామంది చక్కెర లేని బిస్కెట్లు సురక్షితమని భావిస్తారు. అయితే డాక్టర్ రాజేష్ ప్రకారం, బిస్కెట్‌లో చక్కెర లేకపోయినా, శుద్ధి చేసిన పిండి మాత్రం ఉంటుంది. దాన్ని తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల బిస్కెట్ కొనుగోలు చేసే ముందు దానిపై ఉన్న పోషక విలువల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆయన సూచించారు.
అల్పాహారంగా ఏమి తీసుకోవడం బెటర్..?
అల్పాహారంగా బిస్కెట్లకు బదులుగా పోషకాహారాన్ని ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన శనగలు, తామర గింజలు, వేరుశెనగలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు శరీరానికి అవసరమైన శక్తిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఉదయపు అల్పాహారంలో పోషక విలువలు ఉన్న ఆహారాన్ని చేర్చడం ద్వారా మధుమేహం వంటి జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.