Reading Time: < 1 minute
Sangareddy Bjp Training Camp Bb Patil Godavari Anjireddy Clash

BJP Sangareddy : సంగారెడ్డి జిల్లా BJP అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ శిక్షణ శిబిరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేదికపైనే నేతల మధ్య మాటల యుద్ధం నడవడంతో ఒక్కసారిగా వాతావరణం రసాభాసగా మారింది. జిల్లా పార్టీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ మధ్య బహిరంగంగానే తీవ్ర వాగ్వివాదం జరిగింది. పార్టీ ముఖ్య నాయకులు చూస్తుండగానే నేతలు ఒకరిపై ఒకరు అరుచుకోవడంతో ఈ సమావేశం కాస్తా రసాభాసగా ముగిసింది.

సమావేశం కొనసాగుతున్న సమయంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ ఎంపీ బీబీ పాటిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వేదికపై ఉన్న జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిపై ఆయన మండిపడ్డారు. “బీజేపీ పార్టీ మీ అబ్బ సొత్తు కాదు” అంటూ తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీబీ పాటిల్, అవమానం జరిగిన చోట తాను ఉండలేనంటూ సమావేశం మధ్యలోనే అక్కడి నుండి విసవిసా వెళ్లిపోయారు. సీనియర్ నాయకుడైన పాటిల్ ఇలా అర్ధాంతరంగా సమావేశాన్ని బహిష్కరించి వెళ్లడం అక్కడ ఉన్న శ్రేణులను విస్మయానికి గురిచేసింది.

మరోవైపు ఇదే వేదికపై పటాన్‌చెరు బీజేపీ యువనేత నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ సైతం జిల్లా అధ్యక్షురాలితో ఘర్షణకు దిగారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా, ఈ సమావేశానికి అధికారికంగా ఆహ్వానించకపోవడంపై ఆయన నిలదీశారు. ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డితో ఆశిష్ గౌడ్ వాదించారు. అనంతరం ఆయనతో పాటు పటాన్‌చెరుకు చెందిన బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా సమావేశం నుండి నిరసనగా బయటకు నడిచారు. ఈ వరుస పరిణామాలు సంగారెడ్డి జిల్లా బీజేపీలో ఉన్న వర్గపోరును మరోసారి బహిర్గతం చేశాయి.